నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలి
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
–
జహీరాబాద్, అక్షిత న్యూస్ :
రాష్ట్రంలో నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పప్పు దినుసుల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన హామీల మేరకు జాతీయ నూనె గింజల మిషన్, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలు రాష్ట్రంలో సమర్థవంతంగా అమలవుతున్నాయన్నారు. ఇప్పటికే యాంత్రీకరణ పథకానికి లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని వెల్లడించారు. వానాకాలం పంటల సేకరణకు ప్రాధాన్యం ఇస్తూనే, రాబోయే యాసంగి సీజన్ కోసం అమలు చేయాల్సిన పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని, క్లస్టర్ల గుర్తింపు, రైతుల శిక్షణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఝరాసంగం మండలానికి 10 క్వింటాళ్ల కుసుమ విత్తనాలు కేటాయించామని, వాటి సరఫరాతోపాటు ప్రదర్శనా క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశం, విస్తరణ అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.