మృతుడు గణేష్ కుటుంబానికి ఫ్రెండ్స్ యూత్ క్లబ్ చేయూత
చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి
గణేష్ అకాల మరణం అందరిని కలిచి వేసింది
చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం అందరికీ గుణపాఠం కావాలి
బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత
నాగారం అక్షిత న్యూస్ :- మండల పరిధిలోని పసునూరు గ్రామానికి చెందిన చిత్తలూరు గణేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో దురదృష్టవాత్తు మరణించిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబానికి ప్రధాన అండగా, సంతోషానికి కేంద్ర బిందువుగా ఉన్న గణేష్ అకాల మరణంతో గ్రామంలో కుటుంబంలో దిగ్భ్రాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామ యువతలో సేవా కార్యక్రమాల్లో ముందుండే ఫ్రెండ్స్ యూత్ సభ్యులు బాదిత కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు. మంగళవారం మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి గణేష్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ క్లబ్ అధ్యక్షులు పత్తేపురం రవి మాట్లాడుతూ గణేష్ హృదయపూర్వకంగా అందరితో కలిసిపోయే వ్యక్తి అని, అతడి మరణం వల్ల కుటుంబం మాత్రమే కాదు, స్నేహితులం అందరం, గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయిందని తెలిపారు. ఈ కష్ట సమయంలో గణేష్ కుటుంబానికి అండగా ఉండడం మా బాధ్యత అని, మృతుని కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, తక్షణ సహాయ చర్యగా క్వింటాబియ్యం అందజేసి కుటుంబానికి ఆర్థికపరమైన ఆదరణ కల్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అవసరమైనంత సహాయం అందిస్తామని యూత్ సభ్యులు హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను కఠినంగా పాటించాలని, ఎవరు హెల్మెట్ లేకుండా మితిమీరిన వేగంతో ప్రయాణించకూడదని, చిన్న నిర్లక్ష్యమే ప్రాణం తీస్తుందని గణేష్ మరణమే మరొకరికి గుణపాఠంగా నిలవాలని సూచించారు. గ్రామంలో యూత్ క్లబ్ తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగుతాయని యూత్ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కుంభం అరవింద్, ఇరుగు ప్రశాంత్, పత్తేపురం నాగరాజు, చర్లపల్లి రాజు, సైదులు, మామిడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.