ప్రతిఫలం ఆశించొద్దు
పారదర్శకంగా
సేవలు అందించాలి
ప్రతి ఉద్యోగి
నిజాయితీగా ఉండాలి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్
సి నారాయణ రెడ్డి
రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి :
ప్రతి ఉద్యోగి నిజాయితీగా ఉండాలని, ప్రతి శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు ఎటువంటి లోపం లేకుండా బాధ్యతతో, అవినీతి రహితంగా, పారదర్శకంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో రీజినల్ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్’ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని అధికారులు మరియు సిబ్బందిచే ‘సమగ్రత ప్రతిజ్ఞ’ చేయించారు. సెంట్రల్ విజిలెన్స్ అవర్నెస్ ఆర్గనైజేషన్ పోస్టర్స్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా విజిలెన్స్ వారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి శాఖ ఉద్యోగి బాధ్యత విజిలెన్స్, విజిలెన్స్ అందరి బాధ్యత, ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీస్ లో చేరినప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. ప్రజలకు సేవలు పొందే హక్కు ఉందని,ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు అవినీతి లేకుండా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సుపరిపాలన అందించాలని అన్నారు. జిల్లా కేంద్రం నుండి గ్రామం వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మంచి సేవలు అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో విధి నిర్వహణలో నిజాయితీతో కూడిన సేవలను అందించడం, పారదర్శకతను పాటించడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ప్రభుత్వ సహాయం కోసం వచ్చే వారి హక్కులను కాపాడుతూ, న్యాయ సూత్రాలకు అనుగుణంగా సేవలను అందించడానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు వనజాత, హరీష్, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, జిల్లా ఆడిట్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశిందర్ రావు, రీజినల్ విజిలెన్స్ ఇన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.