వరి పంట రక్షణకు రైతులు అప్రమత్తంగా ఉండాలి

వరి పంట రక్షణకు రైతులు అప్రమత్తంగా ఉండాలి

నీరు తొలగించి వరి చేనును పైకి లేపు కట్టాలి

రంగు మారడం మాగుడు తెగులుకు పిచికారి తప్పనిసరి

200 మి.లీ ప్రొపికొనజోల్ ఐదు శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేయాలి

మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) సాయిరాజ్

నాగారం అక్షిత న్యూస్ :- ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. వరి పంట కోతకు చేరువలో ఉండడంతో వర్షాల కారణంగా పంటలు నీట మునిగిపోవడం, కింద పడిపోవడం, మొలకలు రావడం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) సాయిరాజ్ రైతులకు ముఖ్య సూచనలు జారీ చేశారు. అధిక వర్షాల వలన వరి పంటకు జరిగే నష్టం తీవ్రతను తగ్గించేందుకు రైతులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. వరి గింజలు పాలు పోసుకొనే దశలో చేలు వర్షాలతో పడిపోతే, ముందుగా పొలంలో నిల్వ ఉన్న నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలని, అవకాశం ఉంటే పడిపోయిన చేలను పైకి లేపి కట్టుకోవాలని తెలిపారు. అలాగే నిలబడి ఉన్న లేదా పడిపోయిన చేలలో గింజలు రంగు మారడం, మాగుడు తెగులు మరియు మానిపండు తెగులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎగరాకు 200 మిల్లీ లీటర్ల ప్రొపికొనజోల్ పిచికారి చేయాలని రైతులకు సూచించారు. అయితే గింజ గట్టిపడే దశలో ఉన్న పంట అధిక వర్షాలకు గురైతే నిరంతర వర్షాల వలన గింజలలో నిద్ర వ్యవస్థ తొలగి మొలకలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కోత దశలో ఉన్న లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనబడితే నీరు బయటకు తీసివేసిన తర్వాత ఐదు శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల కల్లు ఉప్పు లీటర్ నీటికి) కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. ఇది మొలకెత్తడాన్ని గింజల రంగు మారడాన్ని తగ్గిస్తుందని అన్నారు. రైతులు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారి చేసే అవకాశం ఉన్నందున వెంటనే వ్యవసాయ సిబ్బంది సూచనలను పాటించి పంటలను రక్షించుకోవాలని రైతులకు సూచించారు. వర్షాల తర్వాత చేలలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ సదుపాయాలు కల్పించడం వర్షం తగ్గిన వెంటనే పిచికారి చేయడం పంట రక్షణకు కీలకమని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గద్దల యాదగిరి,మాలోతు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking