కొల్లూరు డబల్ బెడ్ రూమ్ రాష్ట్రానికే ఆదర్శవంతం

కొల్లూరు డబల్ బెడ్ రూమ్
రాష్ట్రానికే ఆదర్శవంతం

విద్యా, వైద్యానికి
అత్యంత ప్రాధాన్య‌త

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

విద్యా, వైద్య సౌకర్యాల
కల్పనకు తొలి ప్రాధాన్యత

-సంక్రాంతి నాటికి అర్బన్
ప్రైమరీ హెల్త్ సెంటర్‌ ప్రారంభం

-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ

పటాన్‌చెరు, అక్షిత ప్రతినిధి :

కొల్లూరు డబుల్ బెడ్  రూమ్ కాలనీని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన కాలనీగా రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధ్యక్షతన రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు టు బిహెచ్కె కాలనీలో విఎస్టి కంపెనీ సిఎస్ఆర్ నిధులు రూ.8 కోట్లతో నిర్మించనున్న 60 గదుల పాఠశాల,డైనింగ్ హాల్, అంగన్వాడి కేంద్రం నిర్మాణం పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ,గృహ నిర్మాణ సంస్థ ఎండి.గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ కాలనీ భవిష్యత్తులో ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు.సుమారు 15 వేల కుటుంబాలకు చెందిన లక్షమంది ప్రజలు టు బిహెచ్కె కాలనీలో నివాస ఉండేందుకు విలుగా కాలనీలో అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదనీ అన్నారు. కాలనీలో ప్రహరీ గోడ నిర్మాణం క్రీడా మైదానం ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. కాలనీ నుండి నాంపల్లి, చార్మినార్, హైదరాబాద్ వైపు బస్సులు సౌకర్యం లేదని కాలనీవాసులు తెలపడంతో నాలుగు రోజుల్లో బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. కాలనీలో రూ.8 కోట్ల సిఎస్ఆర్ నిధులతో పాఠశాల భవన నిర్మాణానికి విఎస్టి కంపెనీ ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ నెల 10 నుంచి స‌న్న‌బియ్యం అందేలా చర్యలు చేపట్టాలని, పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు.దీని కోసం త‌మ హౌసింగ్ శాఖ‌కు చెందిన భ‌వ‌నాన్ని పోలీసు శాఖకు ఇస్తామ‌ని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను మంత్రి అభినందించారు.వారం రోజులలో కాలనీలో పోలీసు పోస్టు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు పనిచేయని సీసీ కెమెరాలు వెంటనే మనుమతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.అనంతరం రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నదని అన్నారు. ప్రత్యేక కమ్యూనిటీలకు చెందిన కుటుంబాల చెందిన సుమారు లక్ష మంది ప్రజలు కాలనీలో నివాసం ఉంటున్నారని కాలనీలో నివాసం ఉండే వారికి విద్య వైద్య పరంగా అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.మీ ఇంటి ముంగిట్లోనే డాక్టర్లు,వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు.సంక్రాతికి కాలనీలో ఆరు పడకగదుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు తెల్లాపూర్ టు బిహెచ్కె కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కలెక్టర్ పి.ప్రావీణ్య లతో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య,గృహ నిర్మాణ శాఖ ఎంపీ గౌతమ్, అదనప కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డిఓ రాజేందర్, డీఈవో వెంకటేశ్వర్లు, రామచంద్రాపురం తహసీల్దార్ సరస్వతి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి,గృహ నిర్మాణ శాఖ అధికారులు,రెవెన్యూ అధికారులు,సంబంధిత శాఖ అధికారులు,కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking