అకాల వర్షాలతో ఎస్సారెస్పీ కాలువకు గండ్లు

అకాల వర్షాలతో ఎస్సారెస్పీ కాలువకు గండ్లు

మామిడిపల్లి నుండి డి.కొత్తపల్లి వరకు ప్రధాన కాలువకు గండ్లు

కాలువగండ్లు పూడ్చకపోతే భారీ ప్రమాదం తప్పదు

వాహనదారులు ప్రాణాలను పణంగా పెట్టి రాకపోకలు

నీటిపారుదల శాఖ స్పందించకపోవడంపై ప్రజల విమర్శలు

నాగారం అక్షత న్యూస్ :- ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు సూర్యాపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామ శివారు లోని 70 – డి. కొత్తపల్లి గ్రామం, 71- డిబిఎం ప్రాంతాల మధ్య గుండా వెళ్లే ఎస్సారెస్పీ (శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్) ప్రధాన కాలువకు పెద్ద పెద్ద గండ్లు పడి స్థానిక ప్రజలను, రైతులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాలువ ఒడ్డున వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బ తినడంతో వాహనదారులు, పాలచారులు ప్రాణాలను పణంగా పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికే కాలువ గుట్టలు కొట్టుకపోవడంతో, పక్కన ఉన్న భూములు జారిపడే ప్రమాదం ఉందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా గండ్లు మరింత పెరిగి కాలువ కూలిపోయే ప్రమాదం నెలకొన్నదని, ప్రస్తుతం నీటిని వదిలిన సందర్భంలో ఆ గండ్ల ద్వారా కాలువ నీరు బయటకు పొంగిపోతే పక్కన ఉన్న పంట పొలాలు, గృహాలు గ్రామాలే ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రైతులు భయాందోళన చెందుతున్నారు. ప్రతిరోజు ఈ దారిలో వాహనాలు నడపడం చాలా ప్రమాదకరం, ఎప్పుడు కాలువలోకి వాహనం జారిపోతుందో తెలియని భయం, యావత్తు ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టి ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి గండ్లను పూడ్చి, ప్రధాన కాలువకు పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే ఎప్పుడైనా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు. కాలువ పక్కన భూసమతలీకరణ లేకపోవడం, తగిన బండారాల్లతో గట్టుల బలపరిచే పనులు చేయకపోవడం వలనే ఈ సమస్య ఉత్పన్నమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పది రోజులుగా సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించిన స్పందన లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తికని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి కాలువ పక్కన పడిన గండ్లను పూడ్చాలని ప్రభుత్వానికి, అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking