స్కూల్‌లో చిన్నారిపై ఆయమ్మ దారుణ హింస
వీడియో సోషల్ మీడియాలో వైరల్, కేసు నమోదు
అక్షిత న్యూస్ / గాజులరామరం : షాపూర్ నగర్‌లోని పూర్ణిమ విద్యానికేతన్ స్కూల్‌లో చిన్నారిపై అమానుష హింస చోటుచేసుకుంది. అదే స్కూల్‌లో పనిచేస్తున్న 65 ఏళ్ల ఆయమ్మ లక్ష్మి, మరో ఆయమ్మ చిన్నారిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ సంఘటనను సమీప భవనం మీద నిలబడి ఉన్న ఓ యువకుడు వీడియోగా రికార్డు చేయడంతో విషయం బయటపడింది. జీడిమెట్ల పోలీసుల వివరాల ప్రకారం, శనివారం సాయంత్రం ఆయమ్మ లక్ష్మి చిన్నారిని విచక్షణారాహీతంగా కొట్టగా ఆ గాయలతో ఆ చిన్నారి ఇంటికి చేరుకుంది, భయంతో ఈ విషయం దాచిపెట్టడంతో తల్లిదండ్రులకు అనుమానం రాలేదు. అయితే శనివారం సాయంత్రం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లి ప్రశ్నించగా, స్కూల్ ఆయమ్మ తనను కొట్టిందని చిన్నారి కన్నీరుమున్నీరై చెప్పింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి స్కూల్ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేయగా, ప్రిన్సిపల్ వెంటనే చిన్నారిని షాపూర్‌లోని రామ్‌రాజ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ తలకు స్కానింగ్ చేయగా గాయాలు ఉన్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారికి చికిత్స అందుతోంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, స్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయమ్మ లక్ష్మిని స్టేషన్‌కు తీసుకువచ్చారని సీఐ గడ్డం మల్లేశ్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.