కాంగ్రెస్ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ ?

వర్ధమానుకోట కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ

బండగొర్ల జనార్ధన్, ఆకుల బుచ్చిబాబుల మధ్య హోరా హోరి

ఎమ్మెల్యే నిర్ణయంపై ఇరువర్గాల ఎదురుచూపులు

ఎవరికి సర్పంచ్ అభ్యర్థిత్వం అవకాశం దక్కునో

నాగారం, అక్షిత న్యూస్ :- మండల పరిధిలోని పలు గ్రామపంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచి అభ్యర్థుల ఎంపిక పక్రియ వేగవంతంగా సాగుతున్న నేపథ్యంలో, తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఇప్పటికే కొన్ని గ్రామాల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు రంగుల కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆశీర్వదించిన తర్వాత మండల వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం మరింత ఉత్కంఠ భరితంగా మారింది. అయితే మొత్తం ప్రక్రియలో అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తున్న గ్రామం మండల పరిధిలోని వర్ధమానుకోట.

ఈ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక పూర్తి స్థాయిలో రసవత్తర రాజకీయంగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ప్రధాన నేతలు బండగొర్ల జనార్ధన్ మరియు ఆకుల బుచ్చిబాబు తమ తమ వర్గాల్లో బలమైన పట్టుబాట్లను కలిగి ఉండడంతో, ఇరు వర్గాల మధ్య విభేదాలు, కార్యకర్తల కదలికలు, వర్గ బలం ప్రదర్శనలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇరు వర్గాలు గ్రామస్థాయి రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని చూపేందుకు సమావేశాలు, గ్రామ పెద్దలతో చర్చలు, అనుచర కార్యకర్తల సమీకరణలు పెడుతూ, అభ్యర్థిత్వం తమ నాయకుడికి దక్కేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో గ్రామంలో రోజుకో కొత్త రాజకీయ మలుపు తిరుగుతూ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. గ్రామ ప్రజలు కూడా ఎవరికి సర్పంచ్ అభ్యర్థిత్వం అన్న ఆసక్తితో రాజకీయ పరిణామాలను క్షణక్షణం గమనిస్తున్నారు. అంతేకాక శాసనసభ్యులు మందుల సామేలు ఇరువర్గాల బలాబలాలను, గ్రామ రాజకీయ సమీకరణాలను, అభ్యర్థుల ప్రజాదరణను, ఎన్నికల్లో గెలుపు అవకాశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇరు వర్గాలను ప్రత్యక్షంగా మాట్లాడకుండా, అన్ని అభిప్రాయాలను నిశితంగా సేకరిస్తూ సర్పంచ్ అభ్యర్థి ఎంపికలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూసే దిశగా ఎమ్మెల్యే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రెండు వర్గాలు తీవ్ర ఎదురుచూపుల్లో నిలిచిపోయాయి. పార్టీ అధిష్టానం నుంచి వచ్చే ప్రతి సమాచారం, క్యాంపు ఆఫీసు నుండి బయటకు వచ్చే ప్రతి సంకేతం, కార్యకర్తల మధ్య పెద్ద చర్చకు దారితీస్తుంది. తాము మద్దతీస్తున్న నాయకుడి చివరకు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలుస్తారని ఇరువర్గాల కార్యకర్తలు నమ్మకం వ్యక్తం చేస్తూ, గ్రామ రాజకీయ పరిస్థితిని మరింత ఉత్కంఠ భరితంగా మారుస్తున్నారు. ఇలా వర్ధమానుకోట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎంపిక ఇప్పుడు మండల రాజకీయాల్లో అత్యంత కీలక మలుపుగా నిలిచింది. ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది గ్రామ భవిష్యత్తు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ శక్తి సామర్థ్యాలను కూడా ప్రభావితం చేసే నిర్ణయం కావడంతో, వర్ధమానుకోట గ్రామంపై మండల ప్రజల దృష్టి అంత కేంద్రీకృతం అయింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking