బ్రిటిష్ ఎయిర్ వేస్ సేవల విస్తరణ
ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచి.. సేవల అప్ గ్రేడ్
న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి :
భారత్_ యూకే ప్రయాణికుల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకొని బ్రిటిష్ ఎయిర్ వేస్ తమ ఫ్లైట్ సేవలను విస్తరించనుంది.భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. 2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ ఫ్లైట్ ప్రారంభించనుంది. ప్రస్తుతం ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు బ్రిటిష్ ఎయిర్వేస్ సేవలు అందిస్తోంది. ప్రీమియం ప్రయాణికుల కోసం ముంబై రూట్‌లో ఫస్ట్ క్లాస్ సేవలను తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు, 2026 చివరికి భారతదేశంలోని ప్రధాన రూట్లన్నింటిలోనూ ఆధునిక క్లబ్ సూట్ బిజినెస్ క్లాస్ను అందించనుంది. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచే ప్రయత్నంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. యూకే–ఇండియా ఫ్రీ ట్రేడ్ ఒప్పందం తర్వాత ఇరు దేశాల మధ్య వ్యాపారం, విద్య, పర్యాటక ప్రయాణాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ విస్తరణకు ప్రాధాన్యం ఏర్పడింది. భారతదేశం అమెరికా తర్వాత బ్రిటిష్ ఎయిర్వేస్‌కు రెండో అతిపెద్ద మార్కెట్‌గా మారిందని సంస్థ తెలిపింది. 2024లో 240 మిలియన్లకు పైగా ప్రయాణికులతో భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఎదిగిన నేపథ్యంలో, బ్రిటిష్ ఎయిర్వేస్ ఈ విస్తరణ వ్యూహం భారత్‌లో తన స్థానం మరింత బలపరచనుంది.