ప్రజల తీర్పుతో కొలువుదీరిన కొత్త సర్పంచ్ లు
గ్రామపంచాయతీలలో ఘనంగా పాలకమండలుల ప్రమాణ స్వీకారం
ప్రజాసేవ ధ్యేయంగా పాలన ప్రారంభం గ్రామాల్లో నూతన ఆశలు
గ్రామపంచాయతీల్లో సంబరాల సందడి ప్రజలతో కలిసి పాలనకు శ్రీకారం
నాగారం, అక్షిత న్యూస్ :- గ్రామ ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి 14 గ్రామపంచాయతీలలో నూతన పాలకమండలుల ఘన ప్రమాణ స్వీకారం. మండల పరిధిలోని 14 గ్రామపంచాయతీలలో ఇటీవల ప్రజల చేత నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు మెంబర్లతో కూడిన గ్రామ పాలకమండలులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించి కొలువుదీరిన కొత్త సర్పంచ్ లు. ఆయా గ్రామపంచాయతీలలో ఉదయం 10 గంటల నుంచి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేపట్టగా, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు మరియు నియమిత స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ప్రజాస్వామ్య పండుగను తలపించారు. గ్రామ ప్రజల సమక్షంలో, చట్టబద్ధమైన విధానాలకు అనుగుణంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు మరియు సంబంధిత స్పెషల్ ఆఫీసర్లు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేత ప్రమాణ పత్రాలను చదివించగా, ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తామని సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో తమ పదవుల బాధ్యతలు స్వీకరిస్తూ గంభీరంగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి సంక్షేమ పథకాల సమర్థ అమలు, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, రాజ్యాంగానికి శాసనానికి కట్టుబడి, రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలకమండలి ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలకు ఆయా గ్రామపంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలకు ఘనత చేకూర్చారు. ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు గ్రామీణ ప్రజాస్వామ్య బలాన్ని చాటి చెప్పాయని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలు డిజె సౌండ్ లతో మారు మ్రోగగా, గ్రామాల్లోని ప్రధాన వీధులు సంబరాలతో కలకలలాడాయి. కేరింతలు, జయహో నినాదాలు, విజయోత్సవాలు, ఆనందోత్సవాలతో గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ప్రజల మద్దతు ప్రజాప్రతినిధులు అధికార బాధితులు చేపట్టడం అభివృద్ధికి మంచి ఆరంభమని గ్రామస్తులు తెలిపారు.