పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి:
పోరాటానికి, త్యాగానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు వడ్డే ఓబన్న అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వడ్డే ఓబన్న 219వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ నగరంలోని పద్మావతి కాలనీ, గ్రీన్ బెల్ట్‌లో ఉన్న వడ్డే ఓబన్న విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన వీరుడు వడ్డే ఓబన్న అని, పరాయి పాలనకు ఎదురు నిలిచిన ధీరుడని కొనియాడారు.

సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, సమానత్వం మరియు సామాజిక న్యాయం సాధన కోసం జీవితాంతం పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న అని పేర్కొన్నారు. అన్యాయం, వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన ఉద్యమం నేటి తరానికి ఆదర్శమని, ప్రజల్లో చైతన్యం రగిలించి హక్కుల కోసం నిలబడే ధైర్యాన్ని నూరిపోసిన మహానుభావుడిగా ఆయన చరిత్ర నిలిచిపోతుందని అన్నారు. వడ్డే ఓబన్న ఆశయాలు, ఆలోచనలు నేటి సమాజానికి అత్యంత అవసరమని, ముఖ్యంగా యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో వడ్డే ఓబన్న జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు ప్రవీణ్ కుమార్, ప్రశాంత్, రఘు, వడ్డెర సంఘం అధ్యక్షుడు పీట్ల యాదయ్య, ఉపాధ్యక్షుడు పీట్ల ఊషన్న, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.