*ఎమ్మెల్సి నెల్లికంటి సత్యంను కలిసిన అంతమ్మ గూడెం రైతులు*
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :
అంతమ్మ గూడెం గ్రామ సమీపంలో ఉన్న హేజోలో లాబరేటరీ,శ్రీ జయ లాబరేటరీ మొదలైన పరిశ్రమలు చేస్తున్న కాలుష్యo సమస్యను పరిష్కరించవలసిందిగా తెలంగాణ శాసనమండలి నందు ప్రస్తావించినందున కృతజ్ఞతాపూర్వకంగా కాలుష్య బాధిత గ్రామ రైతులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసినారు.ఈ సందర్భంగా గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం గురించి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన నివేదికలను ఎమ్మెల్సీకి అందజేస్తూ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం బారి నుండి గ్రామ ప్రజలను పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందిగా ఎమ్మెల్సీని రైతులు వేడుకున్నారు.పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్ధ వాయువుల కారణంగా గ్రామ సమీపంలో పీల్చే గాలిలో బెంజిన్,టోలిన్ ఇథైల్ బెంజిన్ వంటి క్యాన్సర్ కారక రసాయనాలతో పాటు అనేక రకాల విషపూరిత వ్యర్ధాలు గాలిలో చేరినాయని,బోరు బావులలో నీటిలో టీడీఎస్ విలువ 50 వేలకు పైగా చేరినదని,వ్యవసాయ భూములలోని మట్టిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ విలువ 16 వేల వరకు చేరినదని రుజువులను నివేదికల రూపంలో ఎమ్మెల్సీకి అందజేసినారు.పరిశ్రమల కాలుష్యం కారణంగా గ్రామంలో ఉండలేక వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేసినారు
పరిశ్రమలు చేస్తున్న కాలుష్యం గురించి పిసిబి అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదని,పరిశ్రమల యాజమాన్యం వారితో అవగాహన కుదుర్చుకున్న పిసిబి ఉన్నతాధికారులు పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా కేవలం ఆదేశాలు మాత్రమే జారీ చేస్తూ అమలు పరచడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు.
గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమలు చేసిన కాలుష్యాన్ని 2025 జూన్ మాసంలో సెంట్రల్ పిసిబి అధికారులు గుర్తించి,కాలుష్యాన్ని అరికట్టుటకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయానికి నివేదికలు పంపినప్పటికీ నేటి వరకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆ కారణంగా పరిశ్రమలు చేసే కాలుష్యంలో ఎటువంటి మార్పు లేకుండా ప్రతిరోజు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధ వాయువుల వాసనలను భరించలేకుండా ఉన్నందున పరిశ్రమలను గ్రామం నుండి తరలించవలసిందిగా ఎమ్మెల్సీని గ్రామస్తులు కోరినారు.గ్రామ సమీపంలో కంటిన్యూస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేయించి గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమలు చేస్తున్న కాలుష్యాన్ని నిరంతరం గుర్తించుటకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరినారు.ఎమ్మెల్సీ ని కలిసిన వారిలో గ్రామ రైతులు గుమ్మి దామోదర్ రెడ్డి,వస్పరి నరసింహ,వస్పరి రేణుక- లింగయ్య,వస్పరి తరుణ్,సురకంటి కృపానంద రెడ్డి తదితరులు ఉన్నారు