నాగారంలో సీఎం కప్ ర్యాలీకి బ్రహ్మరథం
గ్రామీణ ప్రతిభకు వేదికగా సీఎం కప్ ఉద్యమంలా మారిన ర్యాలీ
క్రీడలతో శారీరక మానసిక వికాసం
రాష్ట్రస్థాయి క్రీడాకారుల తయారే లక్ష్యంగా సీఎం కప్ ర్యాలీ
యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సీఎం కప్
నాగారం, అక్షిత న్యూస్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన సీఎం కప్ క్రీడా పోటీలకు మద్దతుగా నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ ర్యాలీ ప్రజల్లో విస్తృతమైన స్పందనను కలిగించింది కాబట్టి క్రీడల ప్రాధాన్యతపై అవగాహన కల్పించే ఉద్యమంలా మారింది. యువతను మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచి క్రీడల వైపు మళ్లించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ కార్యక్రమానికి ఈ ర్యాలీ బలమైన ప్రేరణగా నిలిచింది. నాగారం బంగ్లా గ్రామపంచాయతీ నుండి మండల తహశీల్దార్ కార్యాలయం వరకు సూర్యాపేట – జనగాం ప్రధాన రహదారిపై సాగిన ర్యాలీ నుంచి ఉత్సాహభరిత నినాదాలతో, జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులతో సాగిన ఈ కార్యక్రమం ప్రజల దృష్టిని ఆకర్షించింది. “ఆరోగ్యమే మహాభాగ్యం” “క్రీడలే యువత భవిష్యత్తు”సీఎం కప్ – ప్రతిభకు వేదిక. వంటి నినాదాలు ర్యాలీ అంతట మార్మోగాయి. యువజన సంఘాలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజా ప్రతినిధులు, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. సీఎం కప్ కేవలం ఒక క్రీడా పోటి మాత్రమే కాకుండా, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన సమగ్ర క్రీడా విధానం అని ర్యాలీలో పలువురు వక్తలు స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు సమాన అవకాశాలు కల్పించడం, వారి శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందించడం సీఎం కప్ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. సీఎం కప్ ద్వారా రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అందించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో క్రీడలకు సరైన ప్రోత్సహం లేక ఎంతో మంది ప్రతిభావంతులు వెనుకబడిపోయారని, ప్రస్తుతం ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ ర్యాలీ క్రమశిక్షణతో, శాంతియుతంగా సాగుతూ ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని రగిలించింది. రోడ్డుపై నిలబడి ప్రజలు ర్యాలీని ఆసక్తిగా వీక్షిస్తూ, సీఎం కప్ కార్యక్రమం పై ప్రశంసలు కురిపించారు. యువతలో కనిపించిన ఉత్సాహం, క్రీడల పట్ల ఉన్న ఆసక్తి రాష్ట్రంలో క్రీడా సాంస్కృతికి మరింత బలపడుతున్నదని సంకేతాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ హరి కిషోర్ శర్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. భీంసింగ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగేశ్వర్ రావు, ఎస్సై ఎస్.చిరంజీవి, వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కాంత్, మండల వైద్యాధికారి యనగందుల నాగరాజు, ఏపిఎం శోభారాణి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడుసు లింగయ్య, ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, కార్యదర్శిలు, జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.