కూల్చివేతలు తప్ప
కాంగ్రెస్ సాధించిందేమి లేదు
కేంద్ర హోంశాఖ సహాయ
మంత్రి బండి సంజయ్
కరీంనగర్, అక్షిత బ్యూరో :
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలందరికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చే విషయంలో పోటీ పడుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చే విషయంలో పోటీ పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.నానా కష్టాలు పడి పేదలు అప్పోసప్పో చేసి బతకడానికి ఇండ్లు కట్టుకుంటే వాటిని కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని చెప్పారు. తక్షణమే పేదల ఇళ్ల కూల్చివేతను ఆపాలని, లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్ లోని 51వ డివిజన్ లో రూ.16 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ భండారి వేణుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లోని 51వ డివిజన్ లో రూ.16 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని,ఈ డివిజన్ లో వర్షం వస్తే ఇబ్బందులు ఏర్పడుతున్న దృష్ట్యా ఈ నిధులతో డ్రైనేజీ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ భండారి వేణుపై నమ్మకంతో భారీ మెజారిటీ గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం కేంద్రం నుండి పెద్ద ఎత్తు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను కాంగ్రెస్ పెద్దలపై ఒత్తిడి తెచ్చి తీసుకువస్తామన్నారు. రాజకీయాలకు తావివ్వకుండా అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని, ఇతర పార్టీల నేతలు కూడా తమతో కలిసి రావాలని ఆయన విజ్ఝప్తి చేశారు.కలిసి కట్టుగా పనిచేస్తూ నిధులు తీసుకొచ్చి కరీంనగర్ ను ఆదర్శంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నారే తప్ప రాజకీయ విమర్శలను పట్టించుకోరని విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అందించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని,మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా వేస్తామని ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో సభలో రేవంత్ రెడ్డే ప్రకటించారని, ఇట్లాంటి హామీలు ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నోటి నుండి
ఏ మాట వచ్చినా శాసనం కావాలి, కానీ రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారన్నారు. హామీలు గుప్పించి, నమ్మించి ఓట్లేయించుకుని హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని చేస్తున్నారన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి, రూ.9 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని పదేపదే చెబుతూ వార్తలు రాయించుకున్నార తప్ప ఇప్పటి వరకు రైతు బంధు ఊసే లేదన్నారు. అధికారంలోకి వచ్చాక రైతు భరోసా ఒక దఫా ఎగ్గొట్టారని , ఎన్నికలొస్తే ఏదో ఒక హామీని తూతూ మంత్రంగా అమలు చేసినట్లు నటించి వార్తలు రాయించుకోవడం, ఎన్నికలైపోగానే వాటిని మర్చిపోవడం వాళ్లకు అలవాటైందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలొచ్చే టైంలో మళ్లీ ఏదో ఒక డ్రామాకు తెరతీస్తారని, రాష్ట్ర ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో 6 గ్యారంటీలను అమలు చేయకపోయినా, డీఏలు, ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోయినా ఓట్లేశారనే అహంకారం కాంగ్రెస్ నేతల్లో పెరిగిపోయిందన్నారు. ఏ హామీని అమలు చేయకపోయినా ఓట్లేస్తున్నారని, అందుకే ఈసారి ప్రజలంతా కాంగ్రెస్ కు కర్రు కాల్చివాత పెట్టాలన్నారు. రైతు భరోసా గురించి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదో, ఆ పైసలు రైతుల ఖాతాల్లో వేసే ఆలోచన సీఎంకు ఉందో లేదో స్పష్టం చేయాలన్నారు. రైతు భరోసా మూడు వాయిదాలు కలిపితే రూ.27 వేల కోట్లు, కానీ ఒక రైతు భరోసా వాయిదాను చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తెలివైన వాళ్లుని,తక్షణమే రైతు భరోసాను చెల్లించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. తక్షణమే రైతు భరోసా చెల్లించకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతలు తప్ప సాధించింది ఏముంది? నానా కష్టాలుపడి పేదలు ఇండ్లు నిర్మించుకుంటే, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పేదల ఇండ్లను కూల్చడానికి వారికి మనసెలా వచ్చిందని, పేదలు ఇండ్లు కట్టుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మిస్తూ మోదీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేదల ఇండ్లను కూల్చే విషయంలో పోటీ పడుతోందని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారన్నారు.తాము వాస్తవాలు మాట్లాడితే కేంద్రం ఏమిచ్చిందని ఎదురుదాడి చేయడం సీఎం, మంత్రులకు అలవాటైందని, కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలన్నీ ఆధారాలతో సహా ప్రజల ముందుంచామని తెలిపారు. మరి 6 గ్యారంటీల పేరుతో హామీలిచ్చారని ఇచ్చిన హామీలు కేంద్రానికి చెప్పి మేనిఫెస్టోలో పెట్టార అని ఆయన ప్రశ్నించారు. హామీలు ఇచ్చింది వారేనని అమలు చేయాల్సింది కూడా వారేనని డిమాండ్ చేశారు.ఇండ్ల కూల్చివేతపై బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేశాయి. కలిసే పదవులు పంచుకున్నాయి. ఇప్పడు ఒకరికి ఒకరు పడనట్లు డ్రామాలాడుతున్నారు. మరి వాళ్లిద్దరికి ఎక్కడ చెడిందో వాళ్లే చెప్పాలన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు గత ఎన్నికల్లో మాట్లాడారు. తాము కూడా అదే చెప్పామని, ఈ అంశంపై విచారణ జరిపే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే మేం విచారణ చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆ మేరకు లేఖ రాయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.