*చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు*

*చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు*

మభ్యపెట్టి దొంగతనానికి పాల్పడిన యువతి

• సాంకేతిక ఆధారాలతో గంటల్లోనే పట్టివేత

నిందితురాలు అరెస్ట్.. బంగారు గొలుసు, సెల్‌ఫోన్ స్వాధీనం

మందమర్రి రూరల్, అక్షిత న్యూస్:

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి నిందితురాలిని అరెస్ట్ చేసి దొంగతనం చేసిన బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.సింగరేణి ఏరియా హాస్పిటల్ సమీపంలో గాజంగి శ్రావణి అనే మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు, సెల్‌ఫోన్‌ను దొంగతనం చేసిన ఘటన చోటుచేసుకుంది. ముందుగా పరిచయం ఉన్న లాస్య అనే మహిళ మభ్యపెట్టి గోదావరిఖని నుండి శ్రావణిని రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా హాస్పిటల్‌కు తీసుకువచ్చింది. శ్రావణి టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో వెనుకనుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు లాక్కొని తోసివేయడంతో శ్రావణి కిందపడింది. అనంతరం అక్కడే పడిన మొబైల్ ఫోన్‌ను తీసుకుని రోడ్డువైపు వెళ్లి శ్రీరాంపూర్ వైపుకు వెళ్తున్న ఆటోలో ఎక్కి పరారైంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా (ఐపీఎస్), మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పోలీస్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితురాలి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.పోలీసుల దర్యాప్తులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడింది శ్రీరాంభట్ల మనస్విని అలియాస్ అనూష, యస్మిన్, లాస్య అని గుర్తించారు. గురువారం మంచిర్యాలలోని ముఖారం చౌరస్తాకు దొంగ సొత్తును అమ్మేందుకు వచ్చిన సమయంలో రామకృష్ణాపూర్ ఎస్సై జె. శ్రీధర్, పోలీస్ సిబ్బంది నిందితురాలిని పట్టుకుని దొంగతనం చేసిన సొత్తును రికవరీ చేశారు.ఈ సందర్భంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్శ రమేష్ మాట్లాడుతూ, నిందితురాలు జల్సాలకు అలవాటు పడి భర్త, కొడుకును వదిలి మంచిర్యాలలో నివసిస్తూ దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే స్పందించి నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ఈ కేసును ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించిన రామకృష్ణాపూర్ ఎస్సై జె. శ్రీధర్, పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించి వారికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ పర్శ రమేష్, ఎస్సై శ్రీధర్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking