అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం
భక్తులతో కిటకిటలాడిన దేవాలయ ప్రాంగణం
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మందమర్రి ఏరియా జీఎం దంపతులు
మందమర్రి రూరల్, అక్షిత న్యూస్:
రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ అలివేలు మంగ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం నిత్యహవనం, మండపారాధన, 108 కలశములతో స్వామివారికి మహాభిషేకం నిర్వహించి అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి బలిహరణ, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం నిత్యహవనం అనంతరం సీమంత స్వాగతోత్సవం, ఎదుర్కోలు, బలిహరణ, తీర్థప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు భక్తుల మధ్య భక్తిభావంతో నిర్వహించారు.గురువారం ఉదయం యాగశాల ఆరాధన, మూలమంత్ర మూర్తి మంత్రసహిత సుదర్శన నరసింహ హోమం, బలిహరణ, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ అలివేలు మంగ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, కన్నులపండుగగా నిర్వహించారు. అనంతరం నిత్యహవనం, బలిహరణ, తీర్థప్రసాద వితరణ జరిగింది.శుక్రవారం ఉదయం యాగశాల ఆరాధన, మధ్యాహ్నం తదియారాధన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.