భానుడి భగ భగ…
జిల్లాలో మండుతున్న ఎండలు
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
వడగాల్పులతో జనం బెంబేలు
యాదాద్రి భువనగిరి/ జిల్లా బ్యూరో:
జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఏప్రిల్ మధ్యలో ఉండగానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత రెండు మూడు రోజులుగా ఎండ తీవ్రత ఊహించని స్థాయికి చేరుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్కును దాటేశాయి.జిల్లా వ్యాప్తంగా వీస్తున్న వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడి మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాలు జనం లేక వెలవెలబోతున్నాయి. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. వేడి గాలుల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం వంటివి అధికంగా తీసుకోవాలి. అత్యవసర పనులు ఉంటే ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాతే చూసుకోవాలి. ఎవరైనా స్పృహ కోల్పోయినా లేదా విపరీతమైన జ్వరంతో బాధపడినా వెంటనే నీడలోకి చేర్చి తడి బట్టతో ఒళ్లు తుడవాలి.
రానున్న రోజుల్లో మరింత ముప్పు
రాబోయే వారం రోజుల పాటు ఎండ తీవ్రత ఇలాగే ఉంటుందని, ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
