నీట్ బాధితులకు న్యాయం చేయాలి
లోకేశ్వరంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా…
రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ తాహసీల్దార్‌కు వినతిపత్రం
లోకేశ్వరం, జూలై 23 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, నష్టపోయిన విద్యార్థులకు తక్షణమే పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రమైన లోకేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై పోలీసుల లాఠీఛార్జీని, నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా స్థానిక భగత్‌సింగ్ చౌక్ నుంచి తాహసీల్దార్ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు.అనంతరం లోకేశ్వరం తాహసీల్దార్ సూర్యారావు కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉంటే కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థుల తరఫున నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం భావప్రకటనా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు…