పిల్లలను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ప్రోత్సహించాలి
జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్
చేర్యాల, అక్షిత ప్రతినిధి:
“మన పోలీస్ – మన ఊరు” కార్యక్రమంలో భాగంగా బుధవారం చేర్యాల మండలంలోని అకునూరు గ్రామాన్ని సందర్శించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్,
గ్రామానికి విచ్చేసిన సీపీ కి గ్రామ మహిళలు కోలాటాలతో, కళాకారులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.

సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన 16 సిసిటివి కెమెరాలను, పాఠశాలలో 4 సిసిటివి కెమెరాలను సీపీ ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా సి.పి స్థానిక శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శివాలయ ఆవరణంలో మాదకద్రవ్యాల వ్యతిరేకత థీమ్‌తో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ఆమె పరిశీలించారు. స్థానిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, పాఠశాల విద్యార్థులకు డిక్షనరీలను మరియు గ్రామస్థులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఒగ్గు కళాకారులు మరియు పోలీస్ కళాబృందం డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై పాటల ద్వారా వివరించారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ … పోలీసులు అంటే బయట వ్యక్తులు కాదు, మన పోలీస్ అనే భావన ప్రజల్లో కలగాలని, గ్రామంలో ఏ చిన్న సమస్య తలెత్తినా పోలీసులను సంప్రదించాలని, పిల్లలు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, డ్రగ్స్, మద్యం అలవాట్లు వంటి సమస్యలపై మాకు వినతులు వస్తున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు, మద్యం మరియు గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీపీ విజ్ఞప్తి చేశారు. తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్మురవి, అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఎ ఆర్ సుభాష్ చంద్రబోస్, స్థానిక ఏసిపి సదానందం, ఉప సర్పంచ్ కడారి పల్లవి, వార్డు సభ్యులు, స్థానిక సిఐ రమేష్ , చేర్యాల ఎస్ఐ అపూర్వరెడ్డి , పోలీస్ సిబ్బంది, మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, వివో లు, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, గ్రామ పెద్దలు, యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.