భువనగిరిలో ట్రాఫిక్ అస్తవ్యస్తం.. ఫుట్ పాత్ లు ఆక్రమణ

భువనగిరి లో ట్రాఫిక్ అస్తవ్యస్తం.. ఫుట్ పాత్ లు ఆక్రమణ

భువనగిరి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అదుపుతప్పింది.

యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో 

భువనగిరి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అదుపుతప్పింది. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యకు సరైన నియంత్రణ లేకపోవడంతో పట్టణంలో రోడ్లు నిండా వాహనాలే కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, చౌరస్తాలు ఎక్కడ చూసినా ట్రాఫిక్ రద్దీ తారస్థాయికి చేరుకుంది. ప్రిన్స్ కార్నర్ చౌరస్తా, బస్టాండ్ పరిసర ప్రాంతాలు, వినాయక చౌరస్తా, ఏరియా హాస్పిటల్ పరిసర ప్రాంతాలు, గంజ్ ఏరియా, జిల్లా కోర్టు దగ్గర చాల చోట్ల వాహనాలను రోడ్ల మీదే నిలుపుతుంటారు. దీంతో రోడ్డుపై ప్రయాణం చేసే వాహనాలు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

రోడ్లపైనే పార్కింగ్.. ట్రాఫిక్కు అంతరాయం…

భువనగిరి పట్టణంలోని ముఖ్య రోడ్లపై వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వ్యాపార కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు ల వద్ద పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు లేకపోవడం, ఉన్నవాటిని వినియోగించకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో వాహనాలను రోడ్లపైనే నిలిపివేయడంతో తరచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఈ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ఫుట్ పాత్ లు ఆక్రమణ పాదచారులకు ఇబ్బందులు…

పట్టణంలో ఫుట్పాత్లు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. దుకాణదారులు తమ వ్యాపారాలను ఫుట్పాత్లపై విస్తరించడంతో పాదచారులు రోడ్లపైనే నడవాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజు ఇదే రోడ్ల మీద ప్రయాణించే మున్సిపల్ అధికారులు యథేచ్ఛగా ఫుట్ పాత్ లు ఆక్రమిస్తున్న కూడా వాటిని పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం అర్థం అవడం లేదు.

సెల్లార్లను పార్కింగ్గా వాడని పరిస్థితి..

భవనాల నిర్మాణంలో పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన సెల్లార్లను వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. షాపులు, గోదాములు, కార్యాలయాలుగా మార్చి వాడటం వల్ల వాహనాలు బయట రోడ్లపైనే నిలిపివేయాల్సి వస్తోంది. దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. భువనగిరి కేంద్రంలో సెల్లార్లను పార్కింగ్ కేంద్రాలుగా మార్చకుండా వ్యాపార కేంద్రాలుగా వినియోగిస్తున్న కూడా మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వీటి పై చర్యలు తీసుకోకపోవడం వెనుక పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిద్రావస్థలో అధికారులు……… ప్రజల్లో ఆగ్రహం..

ట్రాఫిక్ సమస్యలు, ఆక్రమణలు, పార్కింగ్ అవ్యవస్థలపై సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో పరిస్థితి మరింత దిగజారిందని స్థానికులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాయగిరి చౌరస్తాలో సైతం షాపుల నిర్వాహకులు యదేచ్చగా రోడ్డును ఆక్రమించేస్తున్నారు. రోడ్లను ఆక్రమిస్తూ వారి వారి వ్యాపార నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ రోడ్డు ఆక్రమణలు ప్రతిరోజు కళ్ళముందే కనిపిస్తున్న కూడా అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం ఉండడం లేదు.

తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్…

ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై అక్రమ పార్కింగ్ను నియంత్రించడంతో పాటు, ఫుట్పాత్లను ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. సెల్లార్లను తప్పనిసరిగా పార్కింగ్కే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచిస్తున్నారు. లేదంటే భువనగిరిలో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking