రేపటి నుంచే ఆర్టీసీ సమ్మె.. 

రేపటి నుంచే ఆర్టీసీ సమ్మె..

 

 

ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం 

తెలంగాణ వ్యాప్తంగా ఈ అర్ధరాత్రి నుంచే నిలిచిపోనున్న బస్సులు 

హైదరాబాద్ అక్షిత ప్రతినిధి 

తెలంగాణలో రవాణా రంగం స్తంభించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. టీజీ ఆర్టీసీ (TGSRTC) ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో, కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) రేపటి నుంచి (ఏప్రిల్ 22) రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రేపు ఉదయం మొదటి డ్యూటీ నుంచే బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తమ 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం హుటాహుటిన ఒక ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, అది కేవలం ‘కాలయాపన’ చేసే చర్యేనని జేఏసీ నేతలు విమర్శించారు. పక్కా హామీ లభించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు.

ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు..

ఈ సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దాదాపు లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులను సమ్మె విరమించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అందుకే అధికారుల కమిటీని నియమించామని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరికొన్ని గంటల్లో సమ్మె ప్రారంభం కానుండటంతో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking