కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు సెన్సెస్ లో కులగణన నమోదుకు అవకాశం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి
మహబూబ్‌నగర్ నగరంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన “హ్యాపీ సండే” కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డ ముఖ్య అతిథిగా పాల్గొని సెన్సెస్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా యాప్ ద్వార వివరాలను నమోదు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో సెన్సెస్ ప్రక్రియ మరింత సులభతరం అయిందని, గతంలో రెండేళ్లకు పైగా పట్టిన ప్రక్రియ ఇప్పుడు ఆన్‌లైన్ మరియు యాప్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతోందని వివరించారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా పారదర్శకత మరియు వేగం పెరిగిందన్నారు. దేశ అభివృద్ధికి సెన్సెస్ ఎంతో కీలకమని, ఖచ్చితమైన డేటా ఆధారంగా ప్రభుత్వాలు సమర్థవంతమైన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించగలవని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ నగరంలో గత కొన్నేళ్లలో జనాభా వేగంగా పెరిగి దాదాపు మూడు లక్షలకు చేరుకుందని, ఈ నేపథ్యంలో తాగునీరు, విద్య, రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి డేటా అత్యంత అవసరమని అన్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్ మేరకు కులగణన వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర వర్గాల సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తే సమాజంలో ఉన్న వెనుకబాటుతనం, విద్యా స్థాయి మరియు జీవన ప్రమాణాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని, అధికారులు ఇంటికి వచ్చినప్పుడు సరైన సమాచారం అందించాలని లేదా స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవంతం కావడానికి ప్రజలందరి సహకారం అత్యంత అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అదనపు కలెక్టర్ శ్రీమతి హరిప్రియ, మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

