మిర్యాలగూడ మండలం ఊట్లపల్లిలో హృదయ విదారక ఘటన
బోరుబావిలో పడ్డ మనవడు. కాపాడబోయి తాత ప్రాణత్యాగం!
నాలుగేళ్ల చిన్నారి సురక్షితం.. ఊపిరాడక వృద్ధుడు మృతి
మిర్యాలగూడ అక్షిత ప్రతినిధి
మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామ శివారులో శనివారం ఒక అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన మనవడిని కాపాడబోయి, ఓ తాత తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. చివరికి చిన్నారి ప్రాణాలతో బయటపడగా తాత మాత్రం ఊపిరాడక కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఊట్లపల్లి గ్రామానికి చెందిన వెంకన్న అనే వృద్ధుడి నాలుగేళ్ల మనవడు ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే తెరిచి ఉన్న ఒక బోరు గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. గమనించిన తాత వెంకన్న. నా మనవడిని కాపాడాలి’ అంటూ క్షణం కూడా ఆలోచించకుండా తన ప్రాణాలను లెక్కచేయకుండా వెంటనే ఆ బోరు గుంతలోకి దిగాడు. అయితే లోతైన ఆ గుంతలో ఊపిరాడక తాత, మనవడు ఇద్దరూ ఇరుక్కుపోయారు. గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికుల సమాచారంతో మిర్యాలగూడ రూరల్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది యుద్ధప్రాతిపదికన ఘటనాస్థలానికి చేరుకున్నారు. జనం గుమికూడటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు, సహాయక సిబ్బంది గంటల తరబడి ఉత్కంఠభరితంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. తీవ్ర శ్రమకోర్చి చివరికి నాలుగేళ్ల చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. చిన్నారి ప్రాణాలతో బయటపడినప్పటికీ.. అప్పటికే గుంతలో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన తాత వెంకన్న పరిస్థితి విషమంగా మారింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. మనవడి కోసం తాత ప్రాణత్యాగం చేసిన ఉదంతం విన్న ఊట్లపల్లి గ్రామమంతా కన్నీరుమున్నీరైంది. వెంకన్న మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.సమయస్ఫూర్తితో స్పందించి, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారి ప్రాణాలను కాపాడిన మిర్యాలగూడ రూరల్ పోలీసులను, రెస్క్యూ సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు