రేపు మెడికల్ షాపుల బంద్.. ముందే జాగ్రత్త పడండి!
ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె..
తెలంగాణలో స్తంభించనున్న మందుల విక్రయాలు!
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి
మీ ఇంట్లోకి అవసరమైన అత్యవసర మందులు ఉంటే ఇప్పుడే కొని పెట్టుకోండి! ఆన్‌లైన్ ఫార్మసీల (ఇ-ఫార్మసీ) అమ్మకాలను నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపునిచ్చిన దేశవ్యాప్త ఒకరోజు బంద్‌కు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (TTCDA) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీనివల్ల రేపు ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16,000 పైగా మందుల దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి.
బంద్‌కు ప్రధాన కారణాలు ఇవే..
కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన తాత్కాలిక అనుమతులను వాడుకుంటూ, ఇ-ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నియంత్రణ లేకుండా ఆన్‌లైన్ లో మందులు అమ్ముతున్నాయని అసోసియేషన్ ఆరోపిస్తోంది. డాక్టర్ల భౌతిక పరిశీలన లేకుండా, ఒకే ప్రిస్క్రిప్షన్‌ను ఆన్‌లైన్‌లో పదే పదే వాడుతూ మత్తు కలిగించే యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద కార్పొరేట్ సంస్థలు ఆన్‌లైన్‌లో ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల వీధి చివర ఉండే చిన్న చిన్న లోకల్ మెడికల్ షాపులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. దీనివల్ల 5 కోట్ల మంది ఆధారపడిన ఈ రంగం సంక్షోభంలో పడిందని కెమిస్ట్లు వాపోతున్నారు.