ఉట్టిపడిన అధ్యాత్మిక శోభ
– పరిఢవిల్లిన సాంస్కృతిక విప్లవం
– వైభవంగా జగన్నాథ రథయాత్ర
– హరే కృష్ణ మూవ్మెంట్ నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో వేలాది మంది భక్తులు
హైదరాబాద్/ అక్షిత ప్రతినిధి
అధ్యాత్మికత ఉట్టిపడింది. వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పరవళ్ళు తొక్కారు. హరే కృష్ణ మూవ్ మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం జూలై 19న కోకాపేట్ లో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొని భక్తి సంప్రదాయం సామాజిక సామరస్యాన్ని చాటి చెప్పారు. శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రా విగ్రహాలను అందంగా అలంకరించిన రథాన్ని అన్ని వర్గాల భక్తులు ఉత్సాహంగా లాగారు. ఊరేగింపు అంతటా సంకీర్తనలు మార్మోగుతూ, ప్రసాదం విరివిగా పంపిణీ చేశారు. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్ రోడ్డులో ఉన్న ట్రైలైట్ వద్ద ఇస్కాన్ స్థాపనాచార్యులు శ్రీల ప్రభుపాద పేరిట రథానికి తొలి లాగుడుతో యాత్ర మొదలైంది. అనంతరం కోకాపేట్ వీధుల గుండా రాజపుష్ప, అట్రియ గోల్డెన్, మైల్ రోడ్డు మీదుగా సాగి నార్సింగిలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ వద్ద ముగిసింది. మార్గం పొడవునా నివాసితులు ప్రార్ధనలు చేస్తూ, రథాన్ని దర్శించుకున్నారు. భక్తులు నిర్దేశించిన ప్రాంతాల్లో పూజలు అర్చనలు నిర్వహించారు. కొబ్బరి కాయలు పూలు పండ్లు వంటి పవిత్ర వస్తువులను సమర్పించారు. రంగు రంగుల లైట్లు పూలతో అలంకరించిన ఈ రథంలో ఎయిర్ బ్రేకులు స్టీరింగ్ వ్యవస్థ పందిరి సర్దుబాటు వ్యవస్థ వంటి ఆధునిక భద్రతా సదుపాయాలు కూడా ఉన్నాయి. సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక ఇంజినీరింగ్ కి కలబోతగా ఇది నిలిచింది. 500 మందికి పైగా భక్తులు కలిసి రథాన్ని లాగుతూ సామూహిక అంకిత భావాన్ని చాటారు. ప్రారంభోత్సవ పూజ ప్రథమ హారతి గణ్యుల చేత చీపురు పట్టే సంప్రదాయ వేడుకతో కార్యక్రమం మొదలైంది. ముఖ్య అతిథిగా న్యాయ మూర్తి సుద్దాల చలపతి రావు (తెలంగాణ హైకోర్టు) రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సుదర్శన్ రెడ్డి (అడ్వకేట్ జనరల్ ) టీపీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు అక్షయ పాత్ర ఫౌండేషన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రాంతీయ అధ్యక్షులు అయిన హిజ్ గ్రేస్ శ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.వేలాది మంది భజనలు ప్రార్థనలు వేద సాహిత్య పంపిణీలో పాల్గొన్నారు. బాసిల్ వుడ్స్ స్కూల్ పిల్లల నాటికలు రంగవల్లులు కోలాటాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకకు మరింత శోభనిచ్చాయి. 20,000 మందికి పైగా భక్తులకు దొన్న ప్రసాదం వడ్డించారు. బాణసంచా ప్రదర్శన సాయంత్రం వేడుకకు మరింత సందడి తెచ్చింది.నార్సింగిలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ వద్ద మెగా కీర్తనలు శ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ ప్రత్యేక ప్రవచనంతో కార్యక్రమం ముగిసింది. అనంతరం శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రలకు తుది హారతి రాత్రి ప్రసాద వితరణ జరిగాయి.తన ప్రసంగంలో ప్రభుజీ రథయాత్ర చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ దీన్ని శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమంతోనూ కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలన్న విశ్వగురు శ్రీల ప్రభుపాద సంకల్పంతోనూ ముడిపెట్టారు.రథయాత్రలో పాల్గొనడం అంటే నేరుగా శ్రీకృష్ణుడితో సాంగత్యం పొందడమేనని విశ్వగురు శ్రీల ప్రభుపాద చెబుతారు. రథంపై ఉన్న భగవానుడిని దర్శించినా. తాళు లాగుతూ కొంచెం సేవ చేసినా కీర్తనలో పాల్గొన్నా గొప్ప ఆధ్యాత్మిక ఫలితం లభిస్తుంది. ఇది మోక్షానికి దారి తీస్తుంది. రథయాత్ర అంటే భగవానుడు స్వయంగా బయటికి వచ్చి అందరినీ ఆశీర్వదించే పండుగ – మన ఇళలోకి హృదయాలోకి వచ్చి మన ఆందోళనలను తొలగించి చైతన్యాన్ని పెంచుతారు.కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గణ్యులు, భక్తులు. వాలంటీరు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రభుత్వ అధికారులందరికీ ప్రభుజీ కృతజ్ఞతలు తెలిపారు. రథయాత్ర వంటి పండుగలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఐక్యతను శాంతిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని భక్తులకు మర్చిపోలేని పవిత్ర అనుభూతిని ఇస్తాయని హరే కృష్ణ మూవ్మెంట్ మరోసారి తెలిపింది.ప్రసాద వితరణ సందర్శకుల సౌకర్యం కోసం చేసిన ఏర్పాట్లు వేడుకను ఎలాంటి ఆటంకం లేకుండా ఆధ్యాత్మికంగా జరిగేలా చూశాయి.


