అధ్వానంగా మారిన కరణ్‌కోట్ – బెల్కటూర్ రహదారి

 అధ్వానంగా మారిన కరణ్‌కోట్ – బెల్కటూర్ రహదారి

గుంతల మయంగా మారి వాహన దారులకు నరక యాతన

తాండూరు, అక్షిత ప్రతినిధి:

తాండూర్ మండలంలోని కరణ్‌కోట్ – బెల్కటూర్ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతల మయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి, వాటిలో నీరు నిల్వ ఉండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజూ ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహన దారులు, ఆటోలు, కార్లు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది. గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు అంచనా వేయడం, కష్టంగా మారి ప్రమాదాల ముప్పు మరింత పెరిగింది. ఈ రహదారి అధ్వానంగా మారడానికి ఓవర్‌లోడ్ ట్రాక్టర్లు, లారీలు అధిక బరువుతో నిరంతరం రాకపోకలు సాగించడమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతించిన పరిమితికి మించి బరువుతో వాహనాలు తిరగడంతో రోడ్డు దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, సంబంధిత అధికారులు ఓవర్‌లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకో వాలని, వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత చర్యలు తీసుకో లేదని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా కంకర పోయడం వల్ల సమస్య మరింత తీవ్ర మైందని, వెంటనే నాణ్యమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు ఓవర్‌లోడ్ వాహనాల రాక పోకలను నియంత్రించాలని, ప్రజలు కోరుతున్నారు.వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి, శాశ్వత మర మ్మతులు చేపట్టడంతో పాటు ఓవర్‌లోడ్ ట్రాక్టర్లు, లారీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking