విషాదం.. అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు..!

విషాదం.. అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు..!

రోడ్డు ప్రమాదంలో ముత్యాల శివ మృతి

 కొన్నేళ్ల క్రితం అన్న నాగరాజును కోల్పోయిన కుటుంబం

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన ముత్యాల శివ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిట్యాల పట్టణంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొనడంతో శివ అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబానికి అండగా మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న శివ.. వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.

 

కొన్నేళ్ల క్రితం అన్న కూడా..

 

శివ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్నేళ్ల క్రితం శివ అన్న నాగరాజు కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతిచెందడం కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. తాజాగా తమ్ముడు శివ కూడా అదే తరహాలో రోడ్డు ప్రమాదానికి బలికావడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. శివ మృతితో నీర్నేముల గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులను పరామర్శించిన గ్రామస్థులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణతో పాటు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking