తుంబూరు మహిళ మర్డర్ మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు
సత్తుపల్లి ,అక్షిత న్యూస్:
సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన గుండాల వెంకట నరసమ్మ ఈనెల 2వ తేదీ రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుమార్తె వెదుళ్ళ మంగమ్మ ఈ నెల 4 వ తేదీ సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మంగమ్మ భర్త వెదుళ్ళ తిరుపతిరావుకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.మొదటి భార్యను వదిలి తుంబూరులో నివాసం ఉంటున్న రెండో భార్య మంగమ్మ వద్ద తిరుపతిరావు ఉంటున్నాడు.తుంబూరు గ్రామానికి చెందిన పగుట్ల సునీత భర్త మృతి చెందడంతో ఆమెతో తిరుపతిరావు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయమై మంగమ్మ తిరుపతిరావు మధ్య తరచూ గొడవలు జరిగేవి.గత నెల 30న సునీత దుద్దేపూడి గ్రామంలో కూలి పనికి వెళ్ళగా తిరుపతిరావు, అతని భార్య మంగమ్మ, అత్త వెంకట నరసమ్మ కలిసి సునీత వద్దకు వెళ్లి ఆమెను దూషించి దాడి చేసి కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర అవమానంగా భావించిన సునీత తిరుపతిరావుతో తన అక్రమ సంబంధానికి వెంకట నరసమ్మ అడ్డుగా ఉందని భావించి ఆమెను ఎలాగైనా హత్య చేయాలని తిరుపతిరావుతో కలిసి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
వెంకట నరసమ్మ ఇంట్లోనే హత్య
ఈనెల 2వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో తిరుపతిరావు, సునీత కలిసి వెంకట నరసమ్మ ఇంటికి వెళ్లారు.ఆ సమయంలో ఆమె తరుపులు తెరిచి కుర్చీలో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. ఇంట్లోకి వెళ్లిన ఇద్దరూ ఆమె చీర కొంగును మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ముందస్తు పథకం ప్రకారం మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తరలించారు. తిరుపతిరావు వాహనం నడుపగా సునీత మృతదేహాన్ని పట్టుకుని వెనుక కూర్చుంది. సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామ శివారులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన కట్టెలు, కొబ్బరి మట్టలు, చెత్తాచెదారం మధ్య మృతదేహాన్ని ఉంచారు. అనంతరం మోటార్ సైకిల్ లో తీసుకొచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.మరుసటి రోజు ఉదయం అక్కడికి వెళ్లి చూడగా మృతదేహం పూర్తిగా కాలక పోవడంతో దానిపై మళ్లీ కొబ్బరి మట్టలు, చెత్తను వేసినట్లు పేర్కొన్నారు.అనంతరం 3వ తేదీ రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో తిరుపతిరావు సునీత అక్కడికి వెళ్లారు.కాలకుండా మిగిలిన శరీర భాగాలను ఆకుపచ్చ మ్యాట్లో చుట్టి కొంత దూరంలోని మరో ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ రోడ్డు పక్కన ఉన్న ఎండిన కట్టెలు, కొబ్బరి మట్టలు ఇతర చెత్తాచెదారం పై మృతదేహాన్ని ఉంచి రెండు బాటిల్స్ పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు.
హత్య చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్
అనంతరం జరిగిన విషయాన్ని తుంబూరు సర్పంచ్ వీరబాబు జిపిఓ ఎక్కిరాల లక్ష్మణ్ కు తెలిపిన తిరుపతిరావు ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంకట నరసమ్మ అదృశ్యం కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించి తిరుపతిరావు, సునీతలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో ఇద్దరినీ జైలుకు తలించారు.నిందితులు హత్యకు ఉపయోగించిన సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఎస్సైలు వీరప్రసాద్, ప్రదీప్ తో పాటు పోలీస్ సిబ్బంది కీలకంగా వ్యవహరించినట్లు కల్లూరు ఇన్చార్జి ఏసిపి సాదుల సారంగపాణి తెలిపారు.