పోలీస్ కానిస్టేబుల్ ఉచిత కోచింగ్‌లో గ్రాండ్ టెస్ట్
నారాయణపేట,అక్షిత బ్యూరో:
వారియర్స్ డిఫెన్స్ అకాడమీ–నారాయణపేట ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట 320ఏ సహకారంతో పోలీస్ కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ తరగతులు లేట్ శ్రీ ఆసారం భట్టాడ్ లయన్స్ భవన్‌లో కొనసాగుతున్నాయి.కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో పరీక్షా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఆదివారం విద్యార్థినీ, విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షకు అభ్యర్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడంలో భాగంగా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ వారి ప్రతిభను అంచనా వేస్తున్నారు. పరీక్షల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పోటీ తత్వం పెంపొందించడంతో పాటు, సమయపాలనతో పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. వారియర్స్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ లయన్ రవికుమార్ గౌడ్ పర్యవేక్షణలో ఉచిత కోచింగ్ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ లయన్ డాక్టర్ ఆంజనేయులు (ఆర్మీ), లయన్ శాంత, లయన్ ఎస్. చక్రవర్తి, అధ్యాపకులు వెంకన్న, శ్రీనివాసులు పాల్గొని విద్యార్థులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకత్వం అందించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పొంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఉచిత కోచింగ్ ద్వారా నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం కల్పిస్తున్న వారియర్స్ డిఫెన్స్ అకాడమీ, లయన్స్ క్లబ్ సేవలను పలువురు అభినందించారు.