పాము కాటుతో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి – సిపిఎం డిమాండ్
నారాయణపేట,అక్షిత బ్యూరో:
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన గురునాథ్, సంగీత దంపతుల రెండవ కుమారుడు, మూడో తరగతి విద్యార్థి రంజిత్ కుమార్ పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని సీపీఎం నారాయణపేట జిల్లా కమిటీ పేర్కొంది.ఈ నెల 6వ తేదీన ఎక్లాస్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలో పాఠాలు వింటున్న సమయంలో రంజిత్ కుమార్ పాము కాటుకు గురై మృతి చెందడం పట్ల సీపీఎం జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విషాదంలో ఉన్న రంజిత్ కుమార్ కుటుంబాన్ని సీపీఎం జిల్లా కమిటీ బృందం పరామర్శించింది.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన చిన్నారి పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. మృత విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత విషయంలో సంబంధిత అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల భద్రత, పరిశుభ్రత, మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలిమృతి చెందిన విద్యార్థి రంజిత్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరింది.అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పాఠశాలల పరిసరాల్లో పాములు, విషపురుగులు సంచరించకుండా నిరంతరం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.పాఠశాల భవనాలు, తరగతి గదులు, పరిసర ప్రాంతాల భద్రతపై అధికారులు తక్షణమే సమగ్ర తనిఖీలు నిర్వహించాలని కోరింది. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని సీపీఎం జిల్లా కమిటీ స్పష్టం చేసింది.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయడంలో విఫలమైతే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించింది.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, అంజలయ్య గౌడ్, జిల్లా నాయకులు కాశప్ప, నరహరి,అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.