అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి పకడ్బందీ కసరత్తు

అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి పకడ్బందీ కసరత్తు

– సీడీపీవో రాజశ్రీ ఆధ్వర్యంలో ధ్రువపత్రాల పరిశీలన

లోకేశ్వరం,అక్టోబర్ 9 అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను అధికారులు అత్యంత పకడ్బందీగా చేపడుతున్నారు. ముధోల్ ప్రాజెక్టు పరిధిలోని లోకేశ్వరం మండలంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను శుక్రవారం అధికారులు పూర్తిస్థాయిలో నిర్వహించారు.
మండలంలోని నగర్‌ తండా, పుష్పూర్‌, సధ్’గాం,మన్మధ్ గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హతలపై సీడీపీవో రాజశ్రీ, ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం కొనసాగింది.
నిబంధనల మేరకే అర్హతల పరిశీలన
అభ్యర్థుల విద్యార్హతలు, నివాస,కుల ధ్రువపత్రాలతో పాటు ఇతర అవసరమైన అన్ని రకాల పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తుల్లో అభ్యర్థులు పేర్కొన్న వివరాలను, వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఒకటికి రెండుసార్లు సరిపోల్చారు. నిర్దేశిత అర్హత ప్రమాణాలకు కచ్చితంగా సరిపోయే అర్హులైన అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టారు.
అవకతవకలకు తావులేకుండా పారదర్శకత
నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు, పైరవీలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నట్లు సీడీపీవో రాజశ్రీ స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేవలం అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసి, నిబంధనల మేరకు తదుపరి నియామక ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking