జర్నలిస్టులకు ఇళ్ళస్దలాలు ఇవ్వాలి

జర్నలిస్టులకు ఇళ్ళస్దలాలు ఇవ్వాలి
– గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ విజ్ఞప్తి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ళస్దలాలు కేటాయించాలని గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల ఇళ్ళస్దలాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్ర కేబినెట్ ఆమోదం ద్వారా ప్రత్యేక జీవో జారీ చేయాలని సొసైటీ సర్వసభ్య సమావేశం సూచించింది. మంగళవారం సొసైటీ అధ్యక్షులు మామిడి సోమయ్య అద్యక్షతన చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. గత పద్నాలుగేళ్లుగా 300 మంది సభ్యులతో నడుస్తున్న గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి నగర శివారులో స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది. ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ప్రతి జర్నలిస్టుకు ఇంటి నిర్మాణం కోసం రూ. ఐదు లక్షల ఆర్ధిక సహాయం చేయాలని కోరారు. తమ సొసైటీకి భూమి ఇవ్వాలని కోరుతూ గతంలో ప్రభుత్వానికి, వివిధ శాఖల ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించామని, త్వరలో మరోసారి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు వినత పత్రాలివ్వాలని సమావేశం నిర్ణయించింది. ఇండ్ల స్థలాల కోసం ఏళ్ళ తరబడి ఎదిరిచూస్తూ వివిధ కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు కూడా ఇంటి స్థలం కేటాయించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. జర్నలిస్టుల ఆర్ధిక, సామాజిక పరిస్థితులకు గుర్తించి వారికి ప్రభుత్వం ఇళ్ళస్దలాలు ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలియజేసింది. సొసైటీలో కొత్త సభ్యత్వాల నమోదుకు ఈనెల 15 నుంచి 30 వ తేదీ వరకు గడువు విధిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదేళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేసిన అర్హత గల జర్నలిస్టులు ఈనెల 15 నుంచి 30 వరకు రూ 1050 బ్యాంకు డీడీతో సభ్యత్వాని దరఖాస్తు చేసుకోవాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. సమావేశంలో తొలుత ఇటీవల మరణించిన పలువురు సొసైటీ సభ్యులు, ఇతర జర్నలిస్టుకు సంతాపం తెలియజేస్తూ తీర్మానించారు. సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ కో-ఆపరేటీవ్ ఫెడరేషన్ ఛైర్మన్ డాక్టర్ ఎండీ అబ్దుల్ షోహెబ్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, సొసైటీ డైరెక్టర్లు పిల్లి రాంచందర్, వీరేష్, బీఆర్కే మూర్తి, యర్రమిల్లి రామారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking