
బిఆర్ఎస్ ను స్థాపిస్తున్న కేసీఆర్ కు సంపూర్ణ మద్దతునివ్వాల్సిన గురుతర బాధ్యత మనందరిది
*తెలంగాణను అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసినట్టే దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకే బిఆర్ఎస్ ఏర్పాటు
*ఖమ్మం జిల్లా గువ్వల గూడెం బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు
ఖమ్మం, అక్షిత బ్యూరో :
కేసీఆర్ టిఆర్ఎస్ ను నెలకొల్పి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు..అదే ఉత్సాహంతో భారత రాష్ట్రీయ సమితి (బిఆర్ఎస్)ను నెలకొల్పే పనిలో నిమగ్నమయ్యారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.గాంధీజీ చూపిన అహింసా మార్గంలో కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడమే కాక ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ అన్ని విధాలా ప్రగతిపథాన నడిపిస్తున్నారు.ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో సద్దుల బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మహిళలు,యువత, గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.కేసీఆర్ సుపరిపాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మన సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన పలు గ్రామాల ప్రజలు తాము కూడా తెలంగాణలో కలిసిపోతామంటున్న విషయాన్ని గుర్తు చేశారు.తెలుగులోనే కాక ఇంగ్లీష్,హిందీ భాషల్లో మంచి పట్టు ఉన్న, సుధీర్ఘ రాజకీయ,పాలనానుభవం,దేశ సమకాలీన పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని రవిచంద్ర వివరించారు.బిఆర్ఎస్ ఏర్పాటుతో భారత రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుందని,పలు ప్రాంతీయ పార్టీలు ఇందులో విలీనం కావడం, మరికొన్ని కూటమిలో చేరడంతో బిఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని వద్దిరాజు చెప్పారు.తద్వారా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తారని, దేశాన్ని గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతారన్న ఆశాభావాన్ని రవిచంద్ర వ్యక్తం చేశారు.దేశ స్థితిగతులను తీర్చిదిద్దేందుకు,ప్రజల బాగు కోసం జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ కు సంపూర్ణ మద్దతునివ్వాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు.