మత సామరస్యానికి ప్రతీక ‘తెలంగాణ’
* మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
* కాంగ్రెస్ కు జోష్ లేదు… బీజేపీకి క్యాడర్ లేదు
* రాజ్ గోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలి
* మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపించాలి
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ పట్టణంలో 20వ వార్డు-బంగారుగడ్డలోని ముస్లిం షాదీఖానాలో బుధవారం నిర్వహించిన మైనారిటీ నేతలు, సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ కు జోష్ లేదు… బీజేపీకి క్యాడర్ లేదని అన్నారు. 18,000 కోట్ల కాంట్రాక్ట్ ను దక్కించుకోవడం కోసం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని రాజ్ గోపాల్ రెడ్డి ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని భాస్కర్ రావు అభర్ధించారు. 500 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టయినా సరే మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందుతానని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఇకపై కూడా ఆయన చేసేదేమీ లేదని విమర్శించారు. స్వార్ధంతో స్వలాభం కోసం బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తోందన్నారు. మైనారిటీ పిల్లల కోసం అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లిం యువతుల పెండ్లి కోసం షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తోందన్నారు. మైనారిటీస్ ఓవర్ సీస్ పథకం ద్వారా ముస్లిం యువత విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను మంజూరు చేస్తోందన్నారు. మసీదుల్లో దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న ఇమామ్ లకు, మౌజమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తున్నదని అన్నారు. మైనారిటీల అభ్యున్నతితో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తోందని భాస్కర్ రావు తెలిపారు. 2014 లో రాష్ట్ర తలసరి ఆదాయంతో పోలిస్తే, ఇప్పుడు పెరిగింది. మన తలసరి ఆదాయంలో సగం కూడా దేశానిది లేదు. కేంద్రం బలహీనంగా ఉంటే రాష్ట్రం కూడా బలహీనంగానే ఉంటుంది. ఏ పరిస్థితుల కారణంగానైనా కేంద్రంలో గడబిడ ఉంటే కచ్చితంగా దానిని ఆపాలి.దానిని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనదేనని భాస్కర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల పక్షపాతి అని తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకొని చౌటుప్పల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకువెళ్ళాలని మైనారిటీలకు భాస్కర్ రావు అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సలీం, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, చౌటుప్పల్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.