రియల్ ఎస్టేట్ దందాలో..ఉపాధ్యాయులు!?
– సరస్వతి నిర్ణయాలకు ఆలస్యంగా
– సెల్ఫోన్ లతోనే టైం పాస్
– విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్ధకం
– విద్యాశాఖ పర్యవేక్షణ శూన్యం
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ, ఏజెన్సీ పరిధిలో ప్రభుత్వ బడుల నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతుంది. ఇందులో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు తమ విధులను విస్మరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సర్వత్రా చర్చ సాగుతోంది. మరి కొంత మంది విధి నిర్వహణలో ఉంటూనే సెల్ఫోన్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి సంభాషణ చేసుకుంటున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ పాఠశాలలకు సమయానికి వెళ్లకుండా ఆలస్యంగా పోతూ, సమయం కాకముందే పాఠశాల నుండి బయలుదేరడం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించడం గమనార్హం. ఈ తంతు పట్టణ, ఏజెన్సీలో జరుగుతుందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా మరికొందరు ఉపాధ్యాయులు సెల్ ఫోన్ ద్వారా టైం పాస్ చేస్తూ కాలం గడుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు అయితే షిఫ్ట్ వైజ్ గా విధులు నిర్వహిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు వాపోతున్నారు. ఉపాధ్యాయులే సమయపాలన పాటించకుండా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వయస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. విద్యార్థులకు సరైన రీతిలో బోధన చేయకపోవడం వల్ల వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల విధులపై పర్యవేక్షణ ఏది…? ఏజెన్సీ, పట్టణ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సర్కార్ పాఠశాలల ఉపాధ్యాయుల పై పర్యవేక్షణ ఏదని విద్యార్థి సంఘాల నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ బడులకు కొంతమంది ఉపాధ్యాయులు ఆలస్యంగా పోతూ సమయం కాకముందే తిరిగి ఇంటికి దారి పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థులకు సంపూర్ణంగా బోధన
అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దిక్కు ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని పేర్కొంటే మరో దిక్కు కొంతమంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సూచనకు తూట్లు పొడుస్తున్నారని మండిపడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో జాతీయ గీతం సైతం జరగడం లేదని అసహనం వ్యక్తం చేయడం గమనించాల్సిన విషయం. ఇప్పటికైనా విద్యా శాఖ అధికారులు దృష్టి సారించి ఉపాధ్యాయుల నిర్వహణపై దృష్టిసారించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.