కళ తప్పిన..పంచ తత్వ పార్క్..!
– తుప్పుపట్టిన పరికరాలు
– అతి తక్కువ కాలంలోనే ఈ దుస్థితి
– 20 లక్షలు పెట్టారు.. గాలికి వదిలేశారు
– దీనికి బాధ్యులెవరు.. గిట్లనే ఉంటుందా
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత ప్రతినిధి :
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రైటర్ బస్తి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న పంచ తత్వ పార్క్.. పూర్తిగా కళ తప్పింది. సందర్శకులతో కళకళలాడాల్సి ఉండగా ఈ పార్క్ ప్రతిరోజు వెలవెలబోతోంది. ఈ దుస్థితికి కారణం ఎవరు..? పట్టించుకునేదెవరు..? పర్యవేక్షణ ఉండదా..? లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పార్క్ బాగోగులు చూసే నాథుడే లేడా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 20 లక్షల రూపాయలతో 2021 ఆగస్టు నెలలో పంచ తత్వ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది.

వ్యాయామానికి సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి అనతికాలంలోనే తుప్పు పట్టి ఎక్కడికక్కడ పడిపోయి దర్శనమిస్తున్న దుస్థితి నెలకొంది. చెత్తా చెదారం తో నిండిపోయి ఉంది. ఈ పార్కుకు సందర్శకులకు రావాలంటే అసహనం వ్యక్తం చేస్తున్న దారుణ దుస్థితి ఉండడం విచారకరం. పార్కును ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఈ పార్కు గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పార్క్ ఆవరణలో ఎక్కడపడితే అక్కడ మొక్కలు పడి వేసి ఉన్నాయి. అవి ఎండకు ఎండి డీలా పడిపోతున్నాయి. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా అనేక రకాల మొక్కలను కొనుగోలు చేసి వాటిని అవసరమైన చోట నాటకుండా చెట్లను తీసుకువచ్చి పంచ తత్వ పార్క్ ఆవరణలో స్టోర్ చేయడం జరిగింది. 20 లక్షలు పెట్టినప్పుడు పార్కు అన్ని హంగులతో పడాల్సింది పోయి వెల వెల పోవడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంచ తత్వ పార్క్ సందర్శకులతో కళకళలాడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.