మున్సిపల్ కార్మికులకు 24 వేల వేతనం ఇవ్వాలి
*సిఐటియు రాష్ట్ర నేత మల్లేష్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా మున్సిపల్ కార్మికులకు 24 వేల వేతనం ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో మిర్యాలగూడ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు పారిశుద్ధ్య కార్మికులకు 24 వేల వేతనం ఇవ్వాలని ఆదేశించిందని కానీ మున్సిపాలిటీలలో ఆ ఆదేశాలను అమలు చేయడం లేదని విమర్శించారు. కేవలం పద్నాలుగు వేలు మాత్రమే ఇస్తున్నారని, దీనివల్ల పారిశుద్ధ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.24వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు యూనిఫాం, సబ్బులు, నూనెను సకాలంలో అందించాలని కోరారు. గ్లౌజులు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు అనారోగ్యాల పాలౌతున్నారని వాపోయారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలన్నారు. అనంతరం నూతన కమిటీని అధ్యక్షులుగా టి.రామ్మూర్తి కార్యదర్శిగా చిలుముల వెంకన్న, ఉపాధ్యక్షులుగా ధరావత్ మోహన్, కళావతి, సహాయ కార్యదర్శిగా ఉబ్బపల్లి జనార్దన్, నాగమణిలను ఎన్నుకున్నారు. సమావేశంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.