ప్రతిభ కనపర్చితే పట్టం సొంతం
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ
అవార్డు అందుకున్న హెలెన్ మేరి
ఏఐసిఎఫ్ అవార్డుల ప్రదానం
మంద జగన్నాథం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఏ రంగంలోనైనా చక్కటి ప్రతిభ కనపర్చితే పట్టం సాధ్యమని మాజీ ఎంపి, డా. మంద జగన్నాథం అన్నారు. శనివారం సికింద్రాబాద్ లోని అమృత వాణి సెంటర్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనపర్చిన వారికి అందించిన జాతీయ ఉత్తమ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశేష కృషిన వారిని ప్రభుత్వం సత్కరించడంతో పాటు స్వచ్ఛంద సంస్థలు సత్కరించడం అభినందనీయమన్నారు.

సమయం చాలా విలువైందని, దానిని సద్వినియోగం చేసుకొని సక్సెస్ కావాలన్నారు. దామెర హెలెన్ మేరి…జనగాం జిల్లా విద్యా శాఖలో విశిష్ట సేవలందించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల చేతుల మీదుగా అందుకొని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడం విశేషమన్నారు.

ఎందరో విద్యార్థిని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అక్షర పునాదులు వేస్తూ వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేసిన హెలెన్ మేరి సేవలు విశిష్ఠమన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బ్రదర్ గద్దపాటి విజయ రాజ్ మాట్లాడుతూ క్రైస్తవుల హక్కుల సాధనకు ఏఐసీఎఫ్ అంకురించిందని, పాతికేళ్ల నుంచి ఉద్యమిస్తున్నామన్నారు. క్రైస్తవులు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని మరింత ప్రోత్సహించేందుకు తమ సంస్థ అవార్డులను అందించి సత్కరిస్తుందన్నారు.

జనగాం నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయిని, తాజాగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దామెర హెలెన్ మేరి ఎలియాజర్, ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ ప్రధానోపాద్యాయురాలు లక్ష్మి నర్సమ్మ, బక్క సుమలతలు అవార్డులను అందుకున్నారు. హెలెన్ మేరిని మాతంగి విజయ దాస్, సామేల్ కుమార్ – స్టెల్లా, మాతంగి సృజన్ కుమార్, స్టెఫీలు శాలువా మెమెంటో, బొకేలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డేవిడ్ కడారి, బిషఫ్ డా పమ్మి దానియేలు,దయానంద్ తదితరులు పాల్గొన్నారు.