సెల్లార్ తవ్వకాల జోరు… పట్టించుకోరెవరు?

 

గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలు
 పట్టించుకోని రెవెన్యూ అధికారులు

రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి : అనుమతులు అక్కర్లేదు. ప్రజాప్రతినిధులు… అధికారుల అండ ఉంటే కొండను తొవొచ్చు.గుంటలు… కొండలు… సెలార్లను పెకిలించొచ్చు. బలిసినోళ్లకు అందరూ అండగా నిలుస్తారు. అవసరమైతే నీకింత నాకింత అన్న చందంగా…. తిలా పాపం తలా పిడికెడు అన్న రీతిలో అందరికి ముట్టాజెప్పుతరు. ఇక వాళ్లకు అడ్డేముంటుంది. పేదోడు ఓ ఇరవై గజల్లో ఇళ్లు కట్టుకుంటుంటే అన్నీ అనుమతులు అవసరం… లేదంటే మున్సిపల్ సిబ్బంది ఆ ఇంటి చుట్టూరా తిరుగుతూ నానా యాగి చేస్తారు… కూలోల్లను పనులు చేయనివ్వరు. ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడతారు. గురునానక్ విద్యా సంస్థకు సమీపంలో అక్రమంగా సెల్లారు నిర్మాణ పనులు చేపడుతున్నప్పటికి అధికారులు కిమ్మనడం లేదు. వివరాల్లోకి వెళితే…

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి సెల్లార్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఖానాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ తవ్వకాలు జరుపుతున్నట్లు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సెల్లార్ కోసం తవ్వకాలు జరపాలంటే ప్రభుత్వం నుంచి మైనింగ్, మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ తవ్వకాలు జరపడం పట్ల అధికారుల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

**సెల్లార్ కోసం మున్సిపాలిటీ నుంచి                ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు

మున్సిపాలిటీ కమిషనర్ యూసుఫ్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నుంచి సెల్లార్ కోసం ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదని ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ విలేకరులకు తెలిపారు. స్థానిక తహసిల్దార్, రెవెన్యూ అధికారులను పనులు నిలిపివేయండని చెప్పిన సంబంధిత అక్రమ తవ్వకాలు జరిపే యజమానులు రెవెన్యూ అధికారుల ఆదేశాలను పట్టించుకోవడంలేదని తెలిసింది. ఖానాపూర్ విఆర్ఏ సాయిలు హిటాచిని అక్కడి నుంచి తీసివేయాలని చెప్పిన అక్రమ మట్టి తవ్వకాలు ఆపకుండా నిరాటంకంగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది.వెంటనే మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking