వర్గీకరణకై మిలిటెంట్ పోరు
మాదిగలను మోసం చేసిన పార్టీలకు బుద్ది చెప్పాలి
ఎమ్మార్పీఎస్- ఎంఎస్పి
బెంగళూరు జాతీయ సమావేశంలో మందకృష్ణ మాదిగ పిలుపు
వర్గీకరణ సాధనలో ఎంజేఎఫ్ కీలక పాత్ర
ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షులు దాస్ మాతంగి
బెంగళూరు, అక్షిత ప్రతినిధి :
దేశవ్యాప్తంగా సామాజిక ఉద్యమాలకు కేంద్రంగా పనిచేస్తున్న ఎంఆర్పిఎస్ ను వర్గీకరణ పేరుతో మోసం చేస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని, ఈ క్రమంలో వర్గీకరణ సాధన కోసం మాదిగలు మిలిటెంట్
పోరుకు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మహాజన సోషలిస్టు పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అనుబంధ సంఘాల జాతీయ సమ్మేళనం బెంగళూరు నగరంలో బుధవారం జరిగింది. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ గత 28 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా సామాజిక ఉద్యమాలకు ఎమ్మార్పీఎస్ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. వర్గీకరణ ఉద్యమాన్ని జాతీయ స్థాయి వరకు అన్ని పార్టీలు బలపరుస్తున్నప్పటికీ కుట్రపూరిత లాబీయింగ్ తో కొందరు వర్గీకరణను అడ్డుకుంటున్నారని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు.

ఈ క్రమంలో బిజెపిపై సమరశీల పోరాటం చేసేందుకు మాదిగలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాదిగలను మోసం చేసిన పార్టీలకు మాదిగల సత్తా ఏంటో చూపించడం కోసం మిల్టెంట్ పోరాటానికి సన్నద్ధం కావాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రాజ్యాధికారంలో తమ వాటాను సాధించుకోవడం కోసం మహాజన సోషలిస్టు పార్టీని అధికారం వైపు నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షులు దాస్ మాతంగి మాట్లాడుతూ జర్నలిజం రంగంలోనూ సామాజికంగా వెనుకబడిన వర్గాల పట్ల వివక్షత కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆత్మగౌరవం నినాదంతో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేశామన్నారు. వర్గీకరణ కోసం తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే.. సామాజిక అంశాల పట్ల వెనుకబడిన వర్గాలను చైతన్యం చేసేందుకు ఎంజేఎఫ్ కృషి చేస్తుందని తెలిపారు. ఎంజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన జర్నలిస్టుల ఐక్యత కోసం మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ, ఎంఎస్పి అధ్యక్షులు ప్రదీప్ గౌడ్,
ఎంజెఎఫ్ జాతీయ ఇన్చార్జి తిప్పార్పు లక్ష్మణ్ మాదిగ, ఎంజెఎఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఇంచార్జ్ వేణు, ఎంజెఎఫ్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు హెచ్ రంగనాథ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాటింపు అశోక్, కోశాధికారి సాయి రమేష్, రాష్ట్ర నాయకులు మనోహర్, గోపాలరావు, మహేందర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు గాదె రమేష్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.