జర్నలిస్టులు బాధితుల పక్షాన నిలవాలి : మాచర్ల
పినపాక అక్షిత ప్రతినిధి
జర్నలిస్టులంతా సమాజంలో అన్యాయాలకు గురవుతున్న ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రతి ఒక్క పాత్రికేయుడు కృషి చేయాలని టియుడబ్ల్యూజే టిజేఫ్ మణుగూరు సబ్ డివిజన్ అధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ సెంటర్ నందు శనివారం కొత్తగూడెంలో ప్రారంభించిన రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణా తరగతులకు హాజరైన పాత్రికేయులకు తెలంగాణ మీడియా అకాడమీ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణా తరగతుల్లో సీనియర్ జర్నలిస్టులు తెలియజేసిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వార్తలను ఎంచుకొని సమాజంలో గుర్తింపు పొందాలన్నారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు చర్చలు జరుగుతున్నాయని అర్హులైన ప్రతి ఒక్కరికి స్థలాలు కేటాయించే విధంగా జిల్లా నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దామళ్ల వెంకన్న, చామంచల కృష్ణ, షాబిర్ పాషా, భూక్య జబ్బర్, గడ్డం రాము, ఎడేల్లి భవాని శంకర్, గంగపురి మురళి, ఉల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.