మహిళా బిల్లుపై కవిత పోరాటం
* చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్
* బిల్లును ఆమోదింపజేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్
* ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటం
నేడు దేశ రాజధానిలో రౌండ్ టేబుల్ సమావేశం
* హాజరుకానున్న పలు పార్టీల నేతలు, మహిళా సంఘాలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటం చేస్తున్నారు. ఇటీవలే జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించిన ఆమె.. పోరాటం కొనసాగింపుగా బుధవారం ఢిల్లీ మెరీడియన్ హోటల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. మహిళా బిల్లు ఆమోదంతోపాటు ఇతర మహిళా సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. మహిళా బిల్లు ఆమోదానికి మొండికేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా దారికి తేవాలన్న వ్యూహంపై చర్చించనున్నారు. మహిళా బిల్లు ఆమోదం కోసం అన్ని వర్గాలను, పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు అయినా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు కోసం ఢిల్లీలో ఈ నెల 10న నిర్వహించిన ధర్నాకు మహిళలు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాల నుంచి భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే.