ఆత్మగౌరవ ప్రతీక !.. వల్లభి రామాలయం..!!

 

ఆత్మగౌరవ ప్రతీక..
వల్లభి రామాలయం..!

 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

వల్లభీ రామాలయం… దళితుల ఆత్మగౌరవ ప్రతీకగా ఆధ్యాత్మిక అమృతవాహినిగా పరిడవిల్లుతుంది. రామాలయానికి దళితుడే పూజారిగా నిత్య దీప, దూప నైవేద్యాలందిస్తూ… రామ జపం చేసుకుంటూ ఆత్మీయతకు మాదిరిగా ఉంటూ ఎనిమిది దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది వల్లభీ రామాలయం.

           దేవాలయాలు హైందవ సంస్కృతికి ప్రతిబింబాలు. ఫలానా వాళ్లు మాత్రమే వేదాలు అభ్యసించాలనే సామాజిక కట్టుబాట్లు కలిగిన రోజుల్లో దళితులకు దేవాలయాల్లో ప్రవేశం నిషేదం. అలాంటి రోజుల్లో దేవుణ్ని తమ గుండెల్లో పెట్టుకుని ఏకంగా రామాలయమే నిర్మాణం చేసుకున్నారు. ఆ ఆలయానికి దళితుడే పూజారిగా కొనసాగుతూ వస్తున్నారు. చదువుకు దూరంగా ఉండే దళితులు తమలోని ఒకరు వేదాలు ఒంట పట్టించుకుని, అత్యంత క్లిష్టమైన మంత్రోచ్ఛరణను ఆకలింపు చేసుకోవడం సాహసమే. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో సుమారు 80 ఏళ్ల క్రితం పైగా చోటు చేసుకున్న ఈ సంఘటన చరిత్రలో నేటికీ నిలిచిపోతోంది. అసలు వల్లభి గ్రామంలో దళితులు దేవాలయాన్ని ఎందుకు నిర్మాణం చేశారు. దళితులే పూజారిగా కొనసాగాల్సిన పరిస్థితులేంటి.. వారికెదురైన అనుభవాలను పరిశీలిద్దాం…

          సమాజంలో దళితుల జీవితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకున్నా.. భార్యాపిల్లలు మూడు పూటలా తినడం కష్టమే. అలాంటి వ్యక్తులు వారి కుటుంబ బాగోగులను ఏమాత్రం పట్టించుకోకుండా, సుమారు 8 దశాబ్దాలకు పైగా దేవుడు కోసం తమ జీవితాలను త్యజించి, రాముడే ధ్యాసగా బతుకుతున్నారు. పూజారి ఆచార, సాంప్రదాయాలతో పాటు దేవుడికి దీప, దూప, నైవేద్యాలను తప్పనిసరిగా పెట్టాల్సిందే. దళిత నేపథ్యం నుంచి వచ్చిన వీరికి రోజువారీగా కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టం అవుతోంది.

అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక వైపు దేవుడు, మరో వైపు కుటుంబం కోసం వనరులను సమకూర్చుకోవడం సాధారణ విషయం కాదు. ఈ రామాలయంలో పూజారిగా బాధ్యతలు వహించిన వాళ్లు వాళ్ళ కుటుంబాలను పట్టించుకోవడం మానేయడమే కాకుండా, వీరే వారి కుటుంబానికి భారంగా మారుతూ రాముడి కోసమే బతుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతుండగా దేవుణ్ని చూద్దామని గోడపై నుంచి చూస్తుండగా అవమానించిన సంఘటన దళితులను తీవ్రంగా కలిచివేసింది. దీన్నొక ఆత్మగౌరవ సమస్యగా భావించిన దళితులు రామాలయం నిర్మాణం చేయాలని భావించారు. స్థల సేకరణ, దేవాలయ నిర్మాణం చకాచకా జరిగాయి. ఆ దళితవాడలో సద్గురు బోధానంద బోధనల ప్రభావితంతో ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకున్న వంగూరి రామస్వామి గారు పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. వంగూరి రామస్వామి  1988లో మరణించిన అనంతరం ఆయన కుమారుడు వంగూరి ముత్తయ్య  పూజారిగా కొనసాగారు. ఈయన 2021 వరకూ పూజారిగా కొనసాగుతూ వచ్చారు. అనారోగ్య కారణాలతో ముత్తయ్య గారు మరణించడంతో ఆయన మనువడు వంగూరి అనంతరాములు ప్రస్తుతం పూజారిగా బాధ్యతలను స్వీకరించాడు. వంగూరి అనంతరాములు మునుపెన్నడూ లేని విధంగా టీటీడీలో అర్చకత్వాన్ని, పురోహిత్యాన్ని అభ్యసించడం విశేషం.

రామాలయం నిర్మించిన తర్వాత మాదిగోళ్లకు దేవుడూ కూడానా అంటూ అగ్రకులాలు ఎగతాళి చేసిన సందర్భాలూ లేకపోలేదు. గ్రామంలోని అగ్రకులాలకు, దళితులకు వివాదం రాజుకుంది. అప్పటికే రామాలయం నిర్మాణం పేరుతో ఆత్మగౌరవ జెండాను ఎగురవేసిన దళితులు అగ్రకులాలతో సై అంటే సై అన్నారు. దీంతో ఈ గొడవల్లో దళితులంతా ఇళ్లను వదిలి ఊరు బయటనున్న పాలబండ ఎక్కాల్సి వచ్చింది. అగ్రకులాల దాడులకు దళితులు గ్రామం వదిలిపెట్టిన సంగతి తెలుసుకున్న గాంధీయవాది
బన్సాలీ వల్లభి గ్రామానికి చేరుకుని దళితులు నిర్మాణం చేసిన రామాలయంలోనే దీక్షకు పూనుకున్నారు. ఈ వార్త జాతీయ పత్రికలతో పాటు బిబిసికి తెలియడంతో
ప్రపంచ మంతటా వ్యాపించింది. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ జోక్యం చేసుకోవడం ఫలితంగా ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో గ్రామంలోకి దళితులు వచ్చారు. రాజీ అనంతరం బన్సాలీ దీక్షను విరమించారు.

1990వ యేట శ్రీరామ నవమి పురస్కరించుకుని ఊరంతా విద్యుత్ దీపాలు వెలిగించి శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలను దళిత యువకులు ఘనంగా నిర్వహించారు. ఆ రోజు గ్రామంలోని ఓ అగ్ర కులానికి చెందిన వారి మధ్యనే కొట్లాట జరిగింది. ఆ రాత్రి జరగాల్సిన శ్రీ సీతారాముల ఊరేగింపును విరమించాలని పోలీసులు సూచించారు. పోలీసుల వద్దకెళ్లి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా ఊరేగింపు చేస్తామని దళితులు చర్చించిన ఫలితం లేకపోయింది. దళిత యువకులకు, పోలీసు
అధికారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన పోలీసు అధికారి ఆ యువకులను పంచాయితీ కార్యాలయంలో బంధించారు. విషయం తెలుసుకున్న దళితులు అప్రమత్తమై క్షణాల్లో వందలాధి మంది గుమిగూడి పంచాయితీ కార్యాలయం ముట్టడించారు. పోలీసుల అదుపులో నున్న యువకులను తీసుకెళ్లారు. ఈ ఉత్కంఠభరిత సన్నివేశంలో ఓ వ్యక్తి విసిరిన రాయి పోలీసు అధికారి కాలుకి తగిలింది. పోలీస్ అధికారి మరింత సీరియస్ అయ్యాడు.
సరిగ్గా మూడు నెలల అనంతరం అర్థరాత్రి పోలీసులు గూడెం చుట్టూ ముట్టడించారు. పోలీసు బలగాలు వందలాధి మంది వచ్చి దళితుల ఇళ్లలోకి జొరబడి ఒక్కొక్కర్నీ తీసుకెళ్లారు. ఊరి బయట ఉంచిన బస్సుల్లోకి బలవంతంగా ఎక్కించి ముదిగొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దళితులు అందర్నీ ఎదురెదురు వరుసలో నిల్చోబెట్టించి ఒక్కొక్కరికీ ఒక్కో చెప్పు ఇచ్చి ఒకరినొకరు కొట్టుకోవాలని ఆదేశించారు. వీళ్లు కొట్టుకోకుంటే, వెనుకాల పహారా కాసే పోలీసులు వీళ్లను కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. సుమారు 200 మంది దళితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్లకు పైగా కోర్టు చుట్టూ వాయిదాల కోసం తిరిగారు. అనంతరం ఓ ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న సదరు పోలీస్ అధికారి దళితులను ఇబ్బందులు పెట్టిన కారణంగానే దేవుడు నాకీ పరిస్థితులను కల్పించినట్టుగా పశ్చాత్తాపం చెందాడు. లోక్ అదాలత్ లో పోలీసులు కేసు ఉపసంహరించు కున్నాడు. ఆ రోజు దళితుల మొఖాలు కాంతివంతంగా వెలిగాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 వసంతాలు గడిచినా దళితులు నేటికీ వెనుకబడే ఉన్నారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన దళిత, బహుజనులు దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా కావాలనే డిమాండ్ నేటికీ కొనసాగుతోంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమాన వాట దక్కాలని కోరుతున్నారు. కొందరు సామాజిక వేత్తలు అయితే, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు ఆధ్యాత్మిక రంగంలోనూ సమాన వాటా కావాలని కోరుతున్నారు. దేవాలయాల్లో పూజారులుగా బ్రాహ్మణులతో పాటు దళిత, బహుజనులకూ సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. కానీ, 1940వ దశకంలోనే ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా సమాజం ముందుంచి ఆధ్యాత్మిక రంగంలోనూ మీతో పాటు ప్రతిభ, నైపుణ్యాన్ని కనబర్చగలం అని వల్లభి దళితులు నిరూపించడం అభినందనీయం.

Leave A Reply

Your email address will not be published.

Breaking