ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు

ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

గత రెండు రోజుల క్రితం చెన్నూరు పట్టణంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించే విపక్ష నేతలను, బిజెపి పార్టీ నాయకులను, కార్యకర్తలను తుపాకీతో కాల్చి చంపుతా అని బహిరంగంగా బెదిరించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని బిజెపి మండల అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, ప్రతిపక్ష నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త్యాగాల పునాదుల పైన నిర్మితమైన బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసేవారే తప్ప భయపడి వెన్నుచూపే వారు కారన్నారు. ఇటువంటి తాటాకు చప్పులకు చెన్నూరు నియోజకవర్గంలో ఎవరు భయపడరని, ప్రజలు అంతా గమనిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలు బిజెపి వైపే ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపి జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పెంచాల రంజిత్, నాయకులు సుద్దాల రాజ్ కుమార్, శ్రీనివాస్, పళ్ళ పవన్, భైరనేని రమేష్, ప్రేమ్ సాగర్, రాజేశ్ నాయక్, కాపురపు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking