జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు తీపికబురు

జూనియర్‌ పంచాయతీ

కార్యదర్శులకు గుడ్‌న్యూస్‌..

సర్వీస్‌ క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌..!

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జేపీఎస్‌ల సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాను సీఎం ఆదేశించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణపై చర్చించారు.
జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ లేదంటే డీసీపీలు కమిటీలో సభ్యులుగా కొనసాగనున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి కార్యదర్శి లేదంటే.. శాఖ ఉన్నతస్థాయి అధికారి జిల్లా కమిటీకి పరిశీలికుడిగా వ్యవహరించనున్నారు.
రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేయనుండగా.. జేపీఎస్‌ల పనితీరుపై జిల్లాస్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి.. సీఎస్‌కు నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇదిలా ఉండగా.. పలు చోట్ల తాత్కాలిక ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్లు నియమించిన విషయం తెలిసిందే. ఆయా స్థానాల్లో కొత్త జేపీఎస్‌ల భర్తీ ప్రక్రియ, క్రమబద్ధీకరణ తర్వాత దశను ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking