దశాబ్ది వేడుకలకు సన్నద్ధం
అమరుల త్యాగాలను స్మరించుకుందాం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు’ ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను మరోసారి ఆదేశించారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన తర్వాత ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతి గురించి డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సిఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ రెండు నుంచి రోజూ వారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సిఎం కేసీఆర్ కు వివరించారు.

దేశం గర్వించేలా నిర్మించుకున్న డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విధి నిర్వహణకు అనువుగా గొప్పగా నిర్మాణమయ్యిందని, అధికారులు సిబ్బంది ఆహ్లాదకరవాతావరణంలో పనిచేస్తున్నారని సిఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభించుకుని నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సచివాలయంలో మౌలిక వసతులు పూర్తవ్వడం గురించి, సౌకర్యాలు అందుబాటులోకి రావడం గురించి సిఎస్ శాంతకుమారిని సంబంధిత ఉన్నతాధికారులను సిఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం సంతోషం వ్యక్తం చేశారు.

అన్ని శాఖల హెచ్ వో డీలు వోకే చోట :
సమీకృత హెచ్ వో డీ లకు ట్విన్ టవర్లు – సిఎం కేసీఆర్
సచివాలయం పూర్తిస్థాయిలో పని విధానంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయా ప్రభుత్వ విభాగాధిపతుల (హెచ్ వోడీ) కార్యాలయాలను వొకే చోటకు చేర్చడం గురించి సిఎం చర్చించారు. హెచ్ వోడీఅధికారులకు సెక్రటేరియట్ తో తరచుగా పని వుంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలను కూడా సెక్రటేరియట్ దగ్గర్లో సమీకృతంగా వొకే చోట నిర్మించేందుకు సిఎం కేసీఆర్ నిర్ణయించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్ వో డీలు వాటి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను సిఎం అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్ కు అందుబాటులో విశాలవంతమైన ప్రభుత్వం స్థలాలు ఎక్కడెక్కడున్నాయో సిఎం అడిగితెలుసుకున్నారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు, హెచ్ వో డీలన్నీ వొకే చోట వుండేలా ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు సిఎం తెలిపారు.
రెండు రోజుల్లో సబ్ కమిటీ విధి విధానాల ఖరారు :
కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని బీసీ ఎంబీసీ కులాలు కుల వృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయి బ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సిఎం స్పష్టం చేశారు. వీరికి లక్షరూపాయల చొప్పున దశలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి అమలు విధి విధానాలను మరోరెండు రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ చైర్మన్, బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ సిఎం కేసీఆర్ కు వివరించారు. త్వరిత గతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని సిఎం మంత్రి గంగులను ఆదేశించారు.
సమీక్షా సమావేశం అనంతరం అమరుల స్మారకం వద్దకు సిఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న నిర్మాణం పనులను పరిశీలిస్తూ కలియతిరిగారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే పనులన్నీ పూర్తయి చివరిదశ సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లకు సిఎం పలు సూచనలు చేశారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహానికి రెండు వైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్ అండ్ బి ఇంజనీర్ శశిధర్ ను సిఎం ఆదేశించారు. దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా వుండే విధంగా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు.
అక్కడనుంచి బిఆర్కే భవన్ వద్ద నిర్మించిన వంతెనల నిర్మాణాన్ని సిఎం కేసీఆర్ పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ వంతెనలను నిర్మించారు.
ఈ సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి,దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి తో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, సిఎం వోఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సింగరేణి సిఎండీ శ్రీధర్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఈ ఈ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.