జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై
తన వంతు ప్రయత్నం చేస్తా
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్ టౌన్, అక్షిత న్యూస్ :
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై తన వంతు ప్రయత్నం చేస్తున్నానని, జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తానని ఎమ్మార్డీసీ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జర్నలిస్టుల కుటుంబాలతో మాట ముచ్చట కార్యక్రమం పోస్టర్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టులకు అందరికీ సరిపడే ప్రభుత్వ స్థలం లేని కారణంగా కొంత ఆలస్యం జరుగుతుందని అన్నారు. గత మూడు నెలలుగా తాను జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ భూమి లేని కారణంగా భూమి కోసం పక్క నియోజకవర్గ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కలిసి తమ జర్నలిస్టుల కోసం కొంత ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. ఎల్బీనగర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.