లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు

ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా కొనసాగిన లక్కీ డ్రా

నల్గొండ, అక్షిత ప్రతినిధి : నూతన మధ్యం పాలసీ 2023-2025 సంవత్సరాల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్ లో లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సయిజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 155 మద్యం షాపులకు గాను మొత్తం 7057 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యధికంగా దర్వేశిపురం మద్యం దుకాణానికి ఏకంగా 187 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని వేదిక పైకి ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు.

లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్ లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియను ఆద్యంతం ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా లక్ష్మి గార్డెన్ తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక పైన అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి,ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.సంతోష్, అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking