కాంగ్రెస్ విజయం.. అమరులకు అంకితం

కాంగ్రెస్ విజయం..
అమరులకు అంకితం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ల‌భించిన విజ‌యాన్ని తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు అంకితం ఇస్తున్నామ‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు అనుముల రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు.
`మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మంలో 2003 డిసెంబ‌ర్ మూడో తేదీన శ్రీకాంత చారి అమ‌రుడ‌య్యాడు. ఈ రోజు 2023 డిసెంబ‌ర్ మూడో తేదీన నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌లు విల‌క్ష‌ణ‌మైన తీర్పు ఇవ్వ‌డం ద్వారా రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని పున‌రుద్ధ‌రించి శ్రీకాంతాచారికి తెలంగాణ ప్ర‌జ‌లు ఘ‌న‌మైన నివాళుల‌ర్పించారు` అని రేవంత్ రెడ్డి చెప్పారు.

`కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున మ‌లి తెలంగాణ ఉద్య‌మంలో అమ‌రుడైన శ్రీకాంత చారికి నివాళుల‌ర్పిస్తున్నాం. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యాన్ని పున‌రుద్ధ‌రించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపే అవ‌కాశం కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వానికి ఇచ్చినందుకు తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నా. తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌డానికి ఈ తీర్పు ఇవ్వ‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్య‌త‌ను గుర్తు చేశారు.. బాధ్య‌త‌ను పెంచారు. ` అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

`ఆనాటి ఉమ్మ‌డి హైద‌రాబాద్ రాష్ట్రం ముద్దుబిడ్డ ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే నాయ‌క‌త్వంలో భార‌త్ జోడో యాత్ర క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు 150 రోజులు, 4000 కిలోమీట‌ర్లు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 21 రోజులు భార‌త్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మాకు స్ఫూర్తి నింపి, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విశ్వాసం క‌ల్పించారు` అని రేవంత్‌రెడ్డి కొనియాడారు.

`తెలంగాణ ప్ర‌జ‌ల‌తో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక‌గాంధీల‌కు రాజ‌కీయ ప‌ర‌మైన అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం ఉంది. ఈ కుటుంబంలో మేం కూడా స‌భ్యులం మీకు ఏ అవ‌స‌రం వ‌చ్చినా ఏ క‌ష్టం వ‌చ్చినా ఏ సంద‌ర్భంలోనైనా మీ త‌రుపున ఉంటాం కొట్లాడ‌తాం తెలంగాణ నాలుగు కోట్ల ప్ర‌జ‌ల్లో ఒక‌రం అని ఈ ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కాన్ని, విశ్వాసాన్ని క‌లిగించి ముఖ్యంగా న‌న్ను వెన్ను త‌ట్టి, ఏ సంద‌ర్భంలోనైనా గ‌ట్టిగా నిల‌డి పోరాడ‌మ‌ని త‌న‌కు, త‌న మిత్రుడు సీఎల్పీ నేత‌ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు అండ‌గా రాహుల్ గాంధీ అండ‌గా నిల‌బ‌డ్డారు` అని రేవంత్ రెడ్డి చెప్పారు.

`ఈ విజ‌యాన్ని, పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో పెద్ద‌లంద‌రి స‌హ‌కారం అందించారు. ముఖ్యంగా మాజీ పీసీసీ అధ్య‌క్షుడు హ‌నుమంత‌రావు, సీనియ‌ర్ నేత జానారెడ్డి, మా పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యులు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సీనియ‌ర్ నేత‌లు దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌, శ్రీధ‌ర్ బాబు, టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీ గౌడ్ వంటి సీనియ‌ర్ నాయ‌కుల స‌హ‌కారంతో ఈ రోజు ఈ విజ‌యాన్ని సాధించాం` అని రేవంత్‌రెడ్డి చెప్పారు.

`ఈ విజ‌యం తెలంగాణ అమ‌ర‌వీరుల ఆకాంక్ష‌లు అమ‌లు చేయ‌డానికి, తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం పున‌రుద్ధ‌రించ‌డానికి, సామాన్యులను ఆదుకోవ‌డానికి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌డానికి, భార‌త్‌లోనే కాదు ప్ర‌పంచంలోనే ఉద్య‌మ‌స్ఫూర్తితో మాన‌వుల హ‌క్కుల కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ముందంజ‌లో ఉంటుంది` అని రేవంత్ రెడ్డి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking