ప్రజావాణికి అనూహ్య స్పందన
రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభించింది. అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ చెప్పారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని , వారి అర్జీలను తీసుకున్నారు. ప్రతి అర్జికి ఒక నంబర్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కొరకు వారి సెల్ ఫోన్ నంబర్ కు సంక్షిప్త సందేశo పంపుతున్నట్లు తెలిపారు.
ప్రజావాణి నిర్వహణను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏ ఎస్ అధికారి ముషారఫ్ అలీ,
ఆయుష్ డైరెక్టర్ హరిచందన, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతి బా పూలే ప్రజాభవన్ నందు ఇకనుండి వారానికి రెండు రోజులు పాటు ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రజాభవన్ అధికారులు వెల్లడించారు. ప్రతి మంగళవారం , శుక్రవారం రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి జరుగుతుంది. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుండి విజ్ఞాపనలు ఇచ్చుటకు ప్రజాభవన్ కు చేరుకోవాలని అర్జిదారులకు అధికారులు సూచించారు. ఈ శుక్రవారం 15 వ తేదీన ప్రజావాణి వుంటుoదని అధికారులు వెల్లడించారు.